ఏపీ యం.యల్సీ. ఎన్నికల షెడ్యుల్

 

ఆంద్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటాలో 12యం.యల్సీ. స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమీషన్ నిన్న షెడ్యుల్ విడుదల చేసింది. ఎన్నికలకు నోటిఫికేషన్ జూన్ 9న జారీ అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు: జూన్ 16, నామినేషన్ల పరిశీలన: జూన్ 17, నామినేషన్ల ఉపసంహరణ: జూన్ 19, పోలింగ్: జూలై 3, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన: జూలై 7. కనుక నిన్నటి నుండే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు.

 

ఈ 12స్థానాలలో విజయనగరం, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం మరియు అనంతపురం జిల్లాల నుండి చెరో ఒక్కో స్థానానికి, కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాల నుండి చెరో రెండేసి స్థానాలకి స్థానిక సంస్థల కోటా క్రింద ఎన్నికలు నిర్వహించబడతాయి.

 

అధికార తెదేపా కృష్ణా, గుంటూరు జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఇప్పటికే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసింది. అనంతపురం నుండి పయ్యావుల కేశవ్, చిత్తూరు నుండి గాలి ముద్దు కృష్ణం నాయుడు, విశాఖపట్నం నుండి పప్పల చలపతిరావు, తూర్పు గోదావరి నుండి రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రకాశం నుండి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసింది. కృష్ణా జిల్లా నుండి విజయవాడ పట్టణ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, రాజేంద్రప్రసాద్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లా నుండి అన్నే సతీష్, యం. సోంబాబు, చందు సాంభశివరావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

 

వైకాపా కూడా కృష్ణా జిల్లా నుండి నటుడు కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు పేరును ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన వైకాపాలో చేరబోతున్న బొత్స సత్యనారాయణకు విశాఖ నుండి పోటీ చేయించాలని వైకాపా భావిస్తోంది.