ఆ ఊరిని చూసి మనం తల దించుకోవాల్సిందే!


స్వచ్ఛ భారత్‌ ఉద్యమం ఈ మధ్యకాలంలో మొదలైంది. ఈ ఉద్యమం కోసం ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా, ఎన్ని వందల కోట్లు వెచ్చిస్తున్నా... ఫలితం ఏమేరకు ఉంటుందో చెప్పడం కష్టమే! ఎందుకంటే మనకి తీరు తక్కువ. చెత్త పారేయడం దగ్గర నుంచీ, రోడ్ల మీద పశువులని వదలిపెట్టడం వరకూ ఎవరి ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తుంటారు. అలాంటిది ఎక్కడో ఈశాన్యంలో మూలన ఉన్న ఓ పల్లెటూరు ఆసియాలోనే అతి పరిశుభ్రమైన ఊరు అంటే నమ్మగలరా. నమ్మి తీరాల్సిందే!
అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఆ రాజధానికి 90 కిలోమీటర్ల దూరంలో ‘మాలినాంగ్’ అనే చిన్న ఊరు. ఆ ఊరి జనాభా మొత్తం కలిపితే 600కి మించరు. కానీ ఊరిలోకి అడుగుపెట్టగానే అదేమీ సాధారణమైన పల్లె కాదని అర్థమైపోతుంది. ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుందే కానీ కాగితం ముక్క కానీ, పశువుల వ్యర్థాలు కానీ మచ్చుకైనా కనిపించవు. పైగా త్రికోణం ఆకారంలో ఎక్కడ చూసినా డస్ట్‌ బిన్స్‌ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మట్టిలో కలిసిపోయే వ్యర్థాలకి వేరుగా, కలవని వ్యర్థాలకు వేరుగా బుట్టలు ఉంటాయి.

 

 

మాలినాంగ్‌ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న తపన ఆ ఊరిలో ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. అందుకోసం ప్రతి ఇంట్లోనూ పిల్లాపాపల దగ్గర్నుంచీ ఉదయాన్నే లేచి తమ ఇంటినీ, పరిసరాలనీ శుభ్రపరిచే కార్యక్రమంలో కాసేపు నిమగ్నమైపోతారు. ఊరంతా పేరుకున్న చెత్తలో మట్టిలో కలిసే వ్యర్థాలను ఎరువు కిందరి మార్చేస్తారు. కలవని వ్యర్థాలను ఊరిబయట దూరంగా కాల్చివేస్తారు.

 

ఇంతకీ ఊరిని ఇలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే ఓ కారణం చెబుతారు. ఓ 130 ఏళ్ల క్రితం మాలినాంగ్‌ ఊరిని కలరా జాడ్యం కమ్ముకుంది. అపరిశుభ్రత కారణంగానే ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని వారికి వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి కూడా ఊరిని శుభ్రంగా ఉంచుకోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నారు ఆ ఊరి ప్రజలు.

 

 

పరిశుభ్రతతో పాటుగా మాలినాంగ్‌లోని చాలా విషయాలు మనకి ఆదర్శంగా నిలుస్తాయి. అక్కడ ఏకంగా 95 శాతం అక్షరాస్యత కనిపిస్తుంది. ఇంటింటికీ మరుగుదొడ్డి ఉంది. ఇక మాలినాంగ్‌లో మాతృస్వామ్యానిదే పైచేయిగా కనిపిస్తుంది. అక్కడి ప్రజల ఆస్తి తండ్రి నుంచి కొడుకుకి కాకుండా తల్లి నుంచి కూతురికి సంక్రమిస్తుంది. వారి ఇంటిపేరు కింద తల్లిపేరునే కొనసాగిస్తారు. ఇక గ్రామంలో పొగతాగడం, క్యారీబ్యాగ్‌లు వాడటం నిషేదం. వర్షపు నీటిని వీలైనంతగా ఒడిసిపట్టేందుకు గ్రామప్రజలు ప్రయత్నిస్తారు. తీరిక వేళల్లో పాత ప్లాస్టిక్‌ వస్తువులతో ఏదన్నా కొత్త వస్తువులని రూపొందించే ప్రయత్నం చేస్తారు.

 

మాలినాంగ్ ఇంత ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఎక్కడో మారుమూల ఉన్నా కూడా... ఈ గ్రామ విశిష్టత ప్రపంచానికి తెలిసిపోయింది. డిస్కవరీ పత్రిక 2003లోనే ఈ గ్రామాన్ని ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేర్కొంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో కూడా ఈ గ్రామం గురించి ప్రస్తావించారు. మాలినాంగా మజాకా!

 

 

- నిర్జర.