మంథని మధుకర్‌ మృతికి, టీఆర్‌ఎస్‌కి సంబంధమేంటి? ఆరోజు అసలేం జరిగింది?

మంథని మధుకర్‌ మృతి తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోంది. దళిత సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. విపక్షాలన్నీ ఏకమై ఆరోపణలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దళిత సంఘాలు, విపక్షాలన్నీ కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో ఇటు పోలీసులపైనా, అటు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు మధుకర్‌ మృతి ప్రకంపనలు ఢిల్లీని కూడా తాకడంతో టీఆర్‌ఎస్‌ నేతలు కలవరపడుతున్నారు. ముఖ‌్యమంత్రి కేసీఆర్‌‌కి కూడా మధుకర్‌ కేసు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ టార్గెట్‌గా మూడెకరాలు పోయి ఆరడుగుల జాగనా అంటూ  దళిత సంఘాలు ప్లకార్డులతో ఆందోళనలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ దళిత నేతలు ఇరకాటంలో పడుతున్నారు.

 

మధుకర్‌‌కి చెందినవిగా చెబుతోన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్‌ అవడం, పలువురు తమ పోస్టులతో అందరినీ ఆలోచింపజేయడంతో, ఇటు దళిత సంఘాలు, ఇతర వర్గాలు పెద్దఎత్తున స్పందిస్తున్నాయి. మధుకర్‌ను అత్యంత పాశవికంగా, అమానుషంగా మర్మాంగాలు కోసి, కాళ్లూచేతులు విరిచి, నోట్లో మట్టిపోసి, కళ్లు పీకేసి హత్య చేశారంటోన్న తల్లిదండ్రులకు సంఘీభావం తెలుపుతూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే పోలీసులు చెబుతున్నట్లుగా మధుకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మధుకర్‌ తల్లిండ్రులు, దళిత సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా పెద్దింటి అమ్మాయి తల్లిదండ్రులే అత్యంత పాశవికంగా హత్య చేశారా అనేది సస్పెన్స్‌‌‌గా మారింది. 

 

మార్చి 13న ఇంటి నుంచి బయటికెళ్లిన మధుకర్‌.... మరుసటి రోజు సాయంత్రానికి ఊరు శివార్లలో శవమై కనిపించాడు. అది కూడా మధుకర్‌ ప్రేమించిన అమ్మాయి... ఫోన్‌ చేసి చెప్పడంతో మృతదేహం ఎక్కడుందో తెలిసింది. మధుకర్‌ సోదరుడు సమ్మయ్యకి ప్రేమించిన యువతి చేసి, మధు ఇంటికొచ్చాడా అని అడిగిందని, రాలేదని చెప్పడంతో ఇంటి వెనుకాల కాలువ దగ్గర వెతకమని చెప్పిందని, అక్కడ వెతికితే కనిపించలేదని మధుకర్‌ బ్రదర్‌ సమ్మయ్య చెబుతున్నాడు. అయితే ఎవరైతే తమ ఇంటికొచ్చి మధుకర్‌ను బండి మీద తీసుకెళ్లాడో అతడిని గట్టిగా నిలదీస్తే, సబ్‌స్టేషన్‌ దగ్గర చూడమన్నాడని, అతను చెప్పిన స్థలంలోనే డెడ్‌బాడీ దొరికిందని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. కొట్టిచంపేశారు కాబట్టే మధుకర్‌ మృతదేహం అక్కడుందని మధుకర్‌ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు అమ్మాయి తండ్రి, మరో ఐదుగురితో కలిసి మధుకర్‌ను చంపేశారని తల్లి ఆరోపిస్తోంది. మధుకర్‌ ఒళ్లంతా గాయాలే ఉన్నాయని, మర్మావయాలు కోసి, నోట్లో మట్టి పోశారని, ఇవన్నీ పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, పైగా బెదిరించి అంత్యక్రియలు చేయించారని మధుకర్‌ తల్లి ఆవేదన చెందుతోంది.

 

అయితే మధుకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనాస్థలంలో పురుగులమందు డబ్బా, కర్చీఫ్‌, చున్నీ దొరికాయని, అంతేకాదు మధుకర్‌ ఒంటిపై ఎలాంటి గాయాల్లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే మధుకర్‌ ప్రేమించిన అమ్మాయి.... మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకి బంధువులు కావడంతోనే, పోలీసులు కేసును తారుమారు చేశారని, దళిత సంఘాలు, మధుకర్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమించి అమ్మాయి ఇంట్లో మధుకర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌‌గా పనిచేసేవాడు. దాదాపు రెండేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది, అయితే మధుకర్‌ దళితుడు కావడంతో, అది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు... మొదట మధుకర్‌ను బెదిరించారని, ఆ తర్వాత  చంపేశారని తల్లిదండ్రులు అంటున్నారు. అగ్రకుల దురహంకారంతో అత్యంత పాశవికంగా హత్య చేశారంటున్నారు. 

 

మధుకర్‌ మృతిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.... ఇద్దరూ కలిసి వెంకటాపూర్‌ శివార్లలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు.... అమ్మాయిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారని అంటున్నారు. ఆ యువతి నర్సు మొబైల్‌ తీసుకుని ఫోన్‌ చేయడంతోనే మధుకర్‌ మృతదేహం దొరికిందని చెబుతున్నారు. కానీ మధుకర్‌ మృతదేహం ముళ్ల కంపల్లో పడి ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది నిజమోకాదో తెలియాలంటే ఆ యువతి బయటికొచ్చి అసంలేం జరిగిందో చెబితే గానీ ఈ కేసు ఓ కొలిక్కిరాదు. 

 

దాంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పుట్ట మధు నోరువిప్పారు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ, మాజీ శ్రీధర్‌బాబు కుట్ర అన్న పుట్ట మధు.... మధుకర్‌ మృతితో తనకెలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. దళిత సంఘాలతోపాటు కోదండరాం సహా విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపిస్తుండటంతో... టీఆర్‌ఎస్‌ నేతలు ఇరకాటంలో పడ్డారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ దళిత నేతలు స్పందించకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్‌. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.