తొందరేంలేదు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 6 నెలల సమయం ఉందంటున్న పార్టీలు

 

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన అమలయ్యే అవకాశం ఉన్నప్పటికీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ అంటున్నాయి. చర్చల ప్రక్రియను వేగవంతం చేశాయి. మరో పక్క ప్రభుత్వం ఏర్పాటు తమతోనే సాధ్యమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. గవర్నర్ కోషియారి సిఫారసుతో కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు రాష్ట్రపతి పాలన విధించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 19 రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాకపోవటంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

228 స్థానాలున్న మహారాష్ట్రలో శివసేన కలిసి రాకపోవటంతో 106 స్థానాలు వచ్చిన బీజేపీ వెనక్కి తగ్గింది. విముఖత వ్యక్తం చేస్తూ గవర్నర్ కు సమాచారమిచ్చింది. శివసేనకు గవర్నర్ 24 గంటలు గడువు ఇవ్వగా ఆ పార్టీ తన మద్దతుదారుల జాబితాను అందించేందుకు మరో 24 గంటల సమయం కోరింది. అయితే అందుకు నిరాకరించిన గవర్నర్ ఇక మూడో అధిక సంఖ్యాక పార్టీగా ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీకి మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర వరకూ గడువు ఇవ్వగా, ఆ పార్టీ నేత శరద్ పవార్ కాంగ్రెస్, శివసేనతో చర్చలు జరిపారు. ఒక పక్క విపక్షాలతో చర్చలు జరుగుతుండగానే మరో పక్క గవర్నర్ కోషియారి రాష్ట్రపతి పాలనకు సిఫారసు పంపటం ఆ వెంటనే అమలు చేయడం అన్ని జరిగి పోయాయి. రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు అమలులో ఉంటుంది.

రాష్ట్రపతి పాలన పై ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే సోనియా ప్రతినిథులుగా కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్ ముంబయి ఎన్సీపీ బృందంతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు తొందరేమీ లేదని విధివిధానాలపై శివసేనతో చర్చించి స్పష్టత వచ్చిన తరువాతే ముందుకు సాగుతామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. శివసేనకు మద్దతు ఇవ్వాలని కూడా ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. 

తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన శివసేన నేత ఉద్ధవ్ థాక్రే రాష్ట్రపతి పాలన ఎక్కువ రోజులు ఉండదు అని ధైర్యం చెప్పారు. బీజేపీ వెళ్లి కశ్మీర్ లో పీడీపీతో కలిసినప్పుడు తాము కాంగ్రెస్ తో చేతులు కలిపితే తప్పేంటని ప్రశ్నించారు. హిందుత్వం అంటే రామాలయం నిర్మించటం ఒక్కటే కాదని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కూడా హిందుత్వమే అవుతుందనే థాక్రే కుండ బద్ధలు కొట్టారు. బీజేపీకి 3 రోజుల గడువు ఇచ్చిన గవర్నర్ తమకు మాత్రం 48 గంటలు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. రాష్ట్రపతి పాలన ద్వారా తమకు 6 నెలల గడువు ఇచ్చారన్నారు. త్వరలో మిత్రపక్షాలతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. 

గవర్నర్ వైఖరికి నిరసనగా శివసేన సుప్రీం కోర్టులో కేసు వేసింది. పిటిషన్ బుధవారం విచారణకు వస్తుంది. మరో పక్క శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటుంది. త్వరలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పుకుంటోంది. ఇదిలా ఉండగా గవర్నర్ కోషియారి తీరు ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేసినట్లుగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.