ఆలస్యం! అమృతం! విషం!

ఒక కుర్రవాడికి కేన్సర్‌ చివరి దశలో ఉందని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ అతనికి ఈ ప్రపంచం ఒక దుఃఖసాగరంగా మారిపోయింది. ఎటు చూసినా, ఏది పట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా తన వ్యాధే గుర్తుకు వచ్చేది. అందుకనే నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోతూ తన గదిలో ఒంటరిగా చివరి రోజులను వెళ్లదీస్తూ ఉండేవాడు. ఒకసారి ఎందుకనో కుర్రవాడికి అలా వీధి చివరిదాకా వెళ్లి రావాలని అనిపించింది. చాలాకాలం తరువాత కుర్రవాడు వీధిలోకి అడుగుపెట్టడం చూసి అతని తల్లికి కూడా సంతోషం వేసింది. ఊరికనే అలా నాలుగడుగులు వేసి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇంతలో వీధి చివర కొత్తగా పెట్టిన సీడీల షాప్ చూసేసరికి అందులోకి అడుగుపెట్టాలనిపించింది. కుర్రవాడు సీడీల షాప్‌లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ కౌంటర్‌ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిని చూసి మనసు చెదిరిపోయింది.
ఆ అమ్మాయిని చూడటం కోసం అవసరం లేకపోయినా ప్రతిరోజూ ఆ షాపులోకి వెళ్లి ఏదో ఒక సీడీని కొనుక్కునేవాడు కుర్రవాడు. ఆ సీడీని భద్రంగా ఓ కవర్లో పెట్టి, చిరునవ్వుతో అతనికి అందించేది అమ్మాయి. ఆ అమ్మాయితో ఓసారి సరదాగా అలా షికారుకి వెళ్తే ఎంత బాగుండో అనుకునేవాడు కుర్రవాడు. కానీ తీరా కాదంటే ఆ బాధని తట్టుకునే స్థితిలో అతని మనసు లేదు. అందుకనే కనీసం ఒక్క పది నిమిషాలైనా ఆమెని చూస్తూ గడపడం కోసం రోజూ షాపుకి వెళ్లేవాడు. కానీ అలా ఎన్నాళ్లని వెళ్తాడు. నెల తిరక్కుండానే ఆ కుర్రవాడిని క్యాన్సర్‌ కబళించివేసింది.

 

 కుర్రవాడి చావుకి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఎలాగొలా బంధువుల సాయంతో అతని అంత్యక్రియలు పూర్తిచేసింది. అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా అతని జ్ఞాపకాలని వదలలేకపోయింది తల్లి. కాసేపు అతని గదిలో కూర్చునైనా సేదతీరుదామనుకుంటూ, అతని గదిలోకి అడుగుపెట్టింది. తల్లి గదిలోకి అడుగుపెట్టేసరికి ఒక మూల గుట్టగా పేర్చి ఉన్న సీడీలు కనిపించాయి. కొన్నవి కొన్నట్లు ఆ సీడీలు అలాగే ఉన్నాయి. కనీసం వాటిని కవర్లోంచి కూడా తీయలేదు కుర్రవాడు. అతని అవసరం సీడీలు కాదు కదా! అందులో ఒక కవర్‌ని తెరిచి చూసింది తల్లి. అంతే! కవర్లో ఉన్నదాన్ని చూసి ఆమె గుండె చెదిరిపోయింది. ‘మీ నవ్వు చాలా బాగుంటుంది. ఒకసారి మీతో కాఫీ తాగాలనుంది’ అన్న చీటీ సీడీతో పాటే ఆ కవర్లో ఉంచింది ఆ అమ్మాయి. రెండో కవరు, మూడో కవరు, మరో కవరు, ఇంకో కవరు.... అన్నింటిలోనూ ఇలాంటి చీటీలే ఉన్నాయి.


ఆ కవర్లని కుర్రవాడు ఒక్కసారన్నా తెరిచి చూస్తే అతని చివరి రోజులు ఎంత అందంగా గడిచేవో కదా! పోనీ తన మనసులో ఉన్న మాటనన్నా అతను చెప్పగలిగితే ఎంత బాగుండేదో! మనలో చాలామంది ఆ కుర్రవాడిలాగే ప్రవర్తిస్తుంటాం. మనకి అర్హత లేదనో, సాధ్యం కాదనో... మన లక్ష్యాలని మనసులోనే దాచేసుకుంటాం. దక్కదేమో అన్న భయంతో ఉన్న కొద్ది రోజులనీ భారంగా గడిపేస్తుంటాం. వెనక్కి తిరిగి చూసుకునే సరికి కాలం కాస్తా కరిగిపోతుంది.