డ్రాగన్ … రాక్షసత్వం!

 

చైనా తన చుట్టూ వున్న దేశాలతో నక్క రాజీకీయం చేస్తుంటుంది! ఒక విధంగా చూస్తే ఆ దేశం మొత్తం 18దేశాలతో ప్రస్తుతం గొడవ పడుతోంది. తన చుట్టూ వున్న ఏ దేశంతో కూడా చైనాకు స్నేహ బంధం లేదు. అంతటా, అందరి మీదా దౌర్జన్యం చేయటమే చైనా తత్వం! అయితే, ఇది కేవలం విదేశాలకే పరిమితం అనుకుంటే పొరపాటే! తన స్వంత ప్రజల్ని కూడా చైనా దయతో చూడదు. తేడా వస్తే అక్కడి కమ్యూనిస్టు పాలకులు రాక్షసులైపోతారు! అందుకు చక్కటి ఉదాహరణ జూలై 13న మరణించిన 61ఏళ్ల లియు జియబో! ఆయనెవరూ అంటారా…

 

లియు జియబో ఓ చైనీస్ రచయిత, కవి, మేధావి. ఆయన సంవత్సరాల తరబడి జైల్లో మగ్గి చివరకు క్యాన్సర్ వ్యాధితో విషాదంతం అయ్యారు! నోబెల్ శాంతి బహుమతి కూడా పొందిన ఆయన దేశ ద్రోహం ఆరోపణతో జైల్లో మగ్గిపోయారు. పదకొండేళ్ల శిక్ష అనుభవిస్తోన్న లియు చివరకు అది పూర్తి కాకుండానే మరణించారు. ఒక నోబెల్ గ్రహీత క్యాన్సర్ తో బాధపడుతోంటే చైనీస్ పాలకులు ఎంత మాత్రం పట్టించుకోలేదు. సరి కదా అమెరికా, జర్మనీ లాంటి దేశాలు ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అనుమతించమంటే అందుకు కూడా ఒప్పుకోకుండా రాక్షసంగా ప్రవర్తించారు! అయితే, చైనా కమ్యూనిస్టు పాలకులు లియు అనే రచయిత, కవి, ప్రొఫెసర్ పై ఎందుకు పగ పెంచుకున్నారు?

 

లియు చేసిన ఘోర తప్పిదం చైనాలో ప్రజాస్వామ్యం కావాలనటం! 1989లో జరిగిన టియానెన్మెన్ స్క్వేర్ ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. విద్యార్థులు కోరిన విధంగా ప్రజాస్వామ్యం వుండాలనీ, ఒకే పార్టీ దేశాన్ని ఏలటం తప్పని చెప్పాడు. అది నచ్చని కమ్యూనిస్టులు వేలాది మంది విద్యార్థుల్ని టియానెన్మెన్ స్క్వేర్ లో కాల్పులు జరిపించి చంపించారు. తరువాత లియును జైల్లో పెట్టించారు. ఆయన క్యాన్సర్ తో చనిపోయేదాకా వదిలిపెట్టలేదు. ఆయన భార్యని కూడా గృహనిర్భంధంలో వుంచి కనీసం ఆమె తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లనివ్వలేదు! అంతటి రాక్షసత్వం చైనా పాలకులు లియు , లియు భార్యపై ప్రదర్శించారు!

 

మాట మాట్లాడితే… సిక్కిం వేర్పాటు వాదులకి మద్దుతు ఇస్తాం, కాశ్మీర్ సమస్యలో వేలు పెడతాం అని బెదిరించే చైనాకి ఇండియా, అమెరికా, జపాన్లు గట్టిగా బుద్ది చెప్పాలి. లియు లాంటి ప్రజస్వామ్య వాదులకి అవసరమైన సహాయం చేయాలి. అక్కడి మానవ హక్కులకి భంగం కలిగిస్తోన్న కమ్యూనిస్టు ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చేలా పావులు కదపాలి. అది చైనా సామాన్య ప్రజలకి, దాని చుట్టు పక్కల దేశాలకీ, ప్రపంచానికి కూడా మంచిది!