కేసీఆర్ ను పొగిడిన లగడపాటి

 

అప్పుడెప్పుడో రాష్ట్ర విభజన సమయంలో హడావుడి చేసిన లగడపాటి రాజగోపాల్ అప్పటినుండి ఇప్పటివరకూ ఎక్కువ ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆంధ్ర రాష్ట్రం తరపున గట్టిగా పోరాడిన వారిలో రాజగోపాల్ కూడా ఉన్నారు. ఒకటిగా ఉన్న రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ర్టాల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పిన అప్పటి ఎంపీల్లో ఒకరు. అంతేకాక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పి సవాల్ చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మాట మీద కట్టుబడి నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఉద్యమ సమయంలో రాజగోపాల్ కి, అప్పట్లో ఎంపీ గా ఉన్న కేసీఆర్ కు మధ్య పెద్ద మాటల యుద్ధాలే జరిగాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అదే రాజగోపాల్ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఎందుకంటారా... గోదావరి మహా పుష్కర స్నానాల సందర్భంగా రాజగోపాల్ అతని కుటుంబసభ్యులు కలిసి కరీంనగర్ జిల్లా మంథనిలో పుష్కర స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుష్కర్ల ఏర్పాటు చాలా బాగా చేశారని.. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అంతేకాక ఆంధ్రానుండి కూడా భక్తులు తెలంగాణకు పుష్కర స్నానాలు చేయడానికి వస్తున్నారని.. వారికి కూడా సౌకర్యాలు కల్పించాలని కోరారు.