ముత్తయిదువుని విధవగా మారుస్తారా..

గూడఛర్యం ఆరోపణలపై పాక్ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. అక్కడి సైనిక కోర్టుల నుంచి మరణశిక్షను ఎదుర్కుంటోన్న  భారత  మాజీ నేవి అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ని గత సోమవారం ఆయన తల్లి, భార్య కలిశారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ వ్యవహారాల కేంద్ర కార్యాలయంలో కుల్‌భూషణ్‌ను కలిసిన ఆయన తల్లి, భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయంలో పాక్ వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీసింది.

 

కనీసం చేతితో తాకే అవకాశం లేకుండా అడ్డుగా గాజు గోడను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. మాతృభాషలో మాట్లాడకూడదని.. బొట్టు, గాజులు, మంగళసూత్రం సహా చెప్పులను కూడా తొలగించాలని షరతు పెట్టారు. వీరి వెంట ఉండాల్సిన భారత దౌత్య అధికారిని పక్కకు తీసుకెళ్లారు. దీనిపై భారత్‌లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

 

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్ దాయాదీ దేశం తీరును ఎండగట్టారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పాకిస్థాన్ ఏ మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. భర్త ప్రాణాలతో ఉండగా.. ఓ ముత్తయిదువును వితంతువుగా మారుస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఈ విషయం పాక్‌ అధికారులకు తెలియదా..? కుల్‌భూషణ్ భార్య కట్టుకున్న చీరను బలవంతంగా విప్పించి.. కుర్తా కట్టించడం ఆమెను అవమానించినట్లు కాదా అని.. ఇది యావత్ భారతదేశ మహిళలకు జరిగిన అవమానమని నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాలని.. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సుష్మ హెచ్చరించారు.