అరుకు యంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ కేసు

 

విశాఖ జిల్లా అరుకు యంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ ఈరోజు చార్జ్ షీట్ దాఖలు చేసింది. తప్పుడు ధ్రువ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ. 42 కోట్ల రూపాయాలు అక్రమంగా తీసుకొన్నారని బ్యాంక్ అధికారులు చేసిన పిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేసి ఆమెపై ఐపీసీ 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆమెతో బాటు ఆమెకు సహకరించిన బ్యాంక్ అధికారులపైన, విశ్వేశావరా ఇన్ఫ్రా అనే సంస్థ మీద కూడా సీబీఐ కేసులు నమోదు చేసిందీ రోజు. ఆమెను ఈ కేసు విషయంలో ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఆమె వైకాపా టికెట్ మీద అరుకు నుండి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. కానీ ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆమె పార్టీకి దూరమయ్యారు. ఆమె తెదేపాలో చేరాలనుకొన్నారు. కానీ దాని వలన ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో ఆమెను ఇంతవరకు పార్టీలో చేర్చుకోలేదు. కానీ ఆమె తెదేపాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు.