ఐపీఎస్‌కే ఎదురు నిలిచిన ఏడేళ్ల చిన్నారి..?

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా..ఇప్పటికీ రక్షక భటులంటే చాలా మందికి భయమే..అటు పక్కగా పోలీసు వ్యాను వెళుతున్నా..పోలీసులు కనిపించినా మన వెన్నులో వణుకు రావడం మాత్రం ఖాయం. అటువంటి పోలీసులకు ఎదురు నిలిస్తే ఇంకేమైనా ఉందా..కాకలు తీరిన పెద్ద మనుషులే వారి కళ్లలోకి చూడ్డానికి భయపడతారు అలాంటిది ఏకంగా ఐపీఎస్‌కే ఎదురు నిలిచి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు ఏడేళ్ల బుడతడు.

 

కేరళలోని పుథియవైపే వద్ద ఉన్న ఎల్పీజీ ప్లాంట్ వద్ద కొద్దిరోజుల క్రితం స్థానికులు ఆందోళనకు దిగారు..వారిని అదుపు చేసేందుకు డీసీపీ యతీశ్ చంద్ర తన బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనను విరమించాలని చెప్పకుండానే ప్రజలపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయించారంటూ ప్రజా సంఘాలు డీసీపీపై రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన హెచ్‌ఆర్సీ తమ ఎదుట హాజరుకావాల్సిందిగా యతీశ్‌ను ఆదేశించింది. కమిషన్ ఎదుట హాజరైన యతీశ్ చంద్ర తాను ఎవరినీ కొట్టలేదని, తన విధిని తాను నిర్వహించానని వెల్లడించారు.

 

అదే సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఏడేళ్ల చిన్నారి ఒక్కసారిగా పైకి లేచి "ఆ అంకుల్ అందర్నీ కొట్టాడు. తర్వాతి రోజు పేపర్‌లో అంకుల్ ఫోటో చూశానని" చెప్పడంతో అక్కడున్న కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజలు నిర్ఘాంతపోయారు. ఊహించని షాక్‌ నుంచి తేరుకున్న యతీశ్ .."నేను కొట్టానా.." అని చిన్నారిని ప్రశ్నించగా..దానికి ఆ బాలుడు "అవును..నువ్వే కొట్టావ్" అని సమాధానమిచ్చాడు. విచారణ అనంతరం డీసీపీ యతీశ్ మాట్లాడుతూ..ఈ బాలుడికి ఎవరో బాగా ట్రైనింగ్ ఇచ్చారని..అరెస్ట్ చేసిన ఆందోళనకారులను తాను బాగా చూసుకున్నానని చెబుతూ..అందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్‌కు అప్పగించారు. అయితే ఐపీఎస్‌కు వ్యతిరేకంగా బుడతడు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు కేరళలో సంచలనం సృష్టిస్తోంది. కొందరు ఆ బాలుడిని మెచ్చుకుంటుండగా..మరి కొందరు ఆ కుటుంబానికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.