టీడీపీ కంటే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం... కిషన్ రెడ్డి

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల నుండి కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నా పట్టించుకునే తీరిక తెలంగాణ ప్రభుత్వానికి లేదా అని అన్నారు. మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉన్నా సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. సమ్మె వల్ల నగరం అంతా చెత్తతో నిండిపోయిందని.. చెత్త వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా వారు తమ వేతనాలు పెంచమని అంటున్నారు.. అందులో తప్పేం లేదని.. అన్ని శాఖలకు వేతనాలు పెంచిన కేసీఆర్ వాళ్లకు పెంచడం న్యాయం అని అన్నారు. అయినా తెలంగాణ కోసం సమ్మె చేయవచ్చు కానీ, పొట్టకూటి కోసం సమ్మె చేస్తే తప్పా అని నిలదీశారు. అంతేకాక ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకూ సరిగా స్పందించని కిషన్ రెడ్డి ఇప్పుడు ఓటుకు నోటు కేసు వల్ల తెలుగుదేశం పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీకే ఎక్కున నష్టం కలిగించిందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు వ్యవహారం పై మాకు సంబంధం లేదని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం పై ఆసక్తి నెలకొంది. అలాగే ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.