సెంటిమెంట్ మీద కొట్టిన కిరణ్!

 

 Kiran Samaikyandhra, Indira Gandhi Vardhanti, Congress, Seemandhra, Telangan state, Bifurcation of AP

 

 

తాను సమైక్య వాదినని, తన అభిమానులు అంటున్నట్టు సమైక్య సింహాన్నని నిరూపించుకోవడానికి, సీమాంధ్ర ప్రజల హృదయాలలో తాను కోరుకున్న స్థానాన్ని పొందడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. ఈ అంశం మీద తనకు లభించిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా వినియోగించుకుంటున్నారు. ఆమధ్య రాష్ట్రపతికి, ప్రధానికి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని లేఖలు రాసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

 

ఇప్పుడు ఆయనకి ఇందిరాగాంధీ వర్ధంతి రూపంలో మరో అవకాశం లభించింది. విశాఖపట్నంలో జరిగిన ఇందిరాగాంధీ 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రం ఇప్పటికీ సమైక్యంగా ఉందంటే ఆ ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలసి వుండాలని చెప్పి, ఆ మాటమీద నిలబడి వున్న గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు.



తాను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ ఇప్పటి వరకూ చెప్పిన మాటలన్నీ తన సొంత మాటలు కాదని.. ఇందిరాగాంధీ చెప్పినమాటలనే చెప్పానని అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున మరోసారి సమైక్యవాణిని వినిపించడం పరోక్షంగా మరోసారి సోనియాగాంధీకి సమైక్య సందేశం పంపడమేనని సీఎం సన్నిహితులు అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా అయినా పునస్సమీక్షించుకోవాలని ఆయన పరోక్షంగా సోనియాగాంధీకి సూచిస్తున్నారని అంటున్నారు.



ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించడం ద్వారా సోనియాగాంధీతోపాటు రాష్ట్ర విభజనకు ఉత్సాహంగా ఉరకలు వేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుల ధోరణిలో మార్పు వస్తుందని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. సీఎం చేస్తున్నది నిజంగానో సమైక్యవాదమా, సీమాంధ్రులని మభ్యపెడుతూ సజావుగా విభజన జరిగేలా చేసే ప్రయత్నమా అన్న విషయాన్ని కాలమే తెలియజేస్తుంది. మొత్తం మీద ఇందిరాగాంధీ వర్ధంతి రోజున రాష్ట్ర సమైక్యతకోసం ఇందిరాగాంధీ చేసిన కృషిని ప్రస్తావించడం ద్వారా సీఎం అటు అధిష్ఠానం, ఇటు సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్ మీద గురిచూసి కొట్టారు.