తెరాసకు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాలేదు

 

తెలంగాణలో కేసీఆర్‌ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.బీజేపీ కూడా ప్రచార శంఖారావం పూరించింది.తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు.కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బీజెపీ సమర భేరి సభలో కేసీఆర్‌ పై విరుచుకుపడ్డారు.కేసీఆర్‌ నమ్మక ద్రోహి అని,ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆయన తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌ మాట నిలుపుకోలేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రానికి దళితుణ్ని సీఎం చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు లేదని తన కొడుకునో, కుమార్తెనో సీఎం చేయాలని భావిస్తున్నారని విమర్శించారు.

దళితులకు మూడెకరాల వ్యవసాయ భూములిస్తామన్న కేసీఆర్‌ ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు.తెలంగాణ కోసం అమరులైన 1200మంది కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగాలివ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు.వీరంతా ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అమిత్‌షా పేర్కొన్నారు.2014లో ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని నేడు రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నా వాటని భర్తీ చేయడంలేదని ఆయన ఆరోపించారు.రాష్ట్రంలో 2 లక్షలమంది పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇప్పటివరకు కనీసం 5,000 కూడా కట్టించలేదని ఎద్దేవా చేశారు.

మిషన్‌ కాకతీయ కింద రూ.1500 కోట్లు వ్యయం చేశారని కాని ఒక్క చెరువునూ నింపలేకపోయారని విమర్శించారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సహం లేకపోవడంతో సుమారు 4,500మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు.నిజాం హయాంలోని రజాకార్ల దౌర్జన్యాలను తెలంగాణ ఎన్నటికీ మరిచిపోదన్నారు. అసోంలో సుమారు 40లక్షల మంది అక్రమచొరబాటు దారులున్నట్టు మోదీ ప్రభుత్వం గుర్తిస్తే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ కమ్యూనిస్టు తదితర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ అల్లరి చేస్తున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి కాంగ్రెస్‌ ఎంతో అన్యాయం చేసిందని,సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీవీ చనిపోతే దిల్లీలో అంత్యక్రియలు జరపలేదని అలాంటి కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నిలదీయాలన్నారు.

యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 13వ ఆర్థిక సంఘం ద్వారా తెలంగాణకు రూ.16,537 కోట్లు నిధులు విడుదల కాగా మోదీ హయాంలో 14వ ఆర్ధిక సంఘం ద్వారా రూ.1,15,900 కోట్లు విడుదలైనట్టు అమిత్‌ షా తెలిపారు.తెలంగాణను కేసీఆర్‌ అభివృద్ధి చేయలేకపోయారని అమిత్‌షా విరుచుకుపడ్డారు.తెలంగాణలో తెరాసకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని, బీజేపీనేనని అమిత్‌షా అన్నారు. 2014 తర్వాత దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ రాహుల్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పరాజయం పాలైందని వివరించారు.దేశాన్ని పున నిర్మించే బీజేపీ వైపు ఉంటారో.. దేశాన్ని భ్రష్టు పట్టించే కాంగ్రెస్‌ వైపు ఉంటారో తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.