రాజకీయాలకే కాదు సర్వేలకు సన్యాసం తప్పదు

 

తెలంగాణలో పోలింగ్ ముగిసిన అనంతరం చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను ప్రకటించాయి. దాదాపు అన్ని సంస్థలు టీఆరెస్ నే మళ్ళీ అధికారం చేపట్టనుందని వెల్లడించాయి. కానీ అనూహ్యంగా ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం కూటమి విజయానికే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని సంచలనాత్మక ప్రకటన చేశారు. లగడపాటి సర్వే పై పలువురు టీఆరెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా మంత్రి కేటీఆర్‌ కూడా ఆయన సర్వేపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్‌.. ఫలితాల తర్వాత సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించాయని.. దాదాపు అన్ని సర్వేలూ తెరాసదే గెలుపని చెప్పాయని కేటీఆర్‌ అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో వారు అంచనా వేసిన దానికంటే ఎక్కువ సీట్లు తమకు వస్తాయని.. దాదాపు వందకు పైగా సీట్లు తెరాస గెలుచుకుంటుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో తమకు తాము సీఎంలుగా చెప్పుకొనే నేతలు కొందరు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ప్రజాకూటమి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజు ఒక రకంగా ఉందని.. ముగిసే రోజున మరో రకంగా ఉందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రచారం ముగిసే చివరి రెండు రోజుల్లో చంద్రబాబు ఫొటో లేకుండా ప్రకటనలు ఇచ్చారని గుర్తుచేశారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రచారం వల్ల అపారమైన నష్టం మహాకూటమికి వాటిల్లిందనే విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌లపై, ఈవీఎంలపై మహాకూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్టూ కుంటి సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. తాము ప్రజల్లో మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నామని.. స్ట్రాంగ్‌ రూమ్‌లతో మాకు పనిలేదని చురకలింటించారు. ఈ ఎన్నికల్లో తమకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి ఓటు లెక్కబెట్టే వరకూ కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఆ తర్వాత సంబరాలు చేసుకుందామని సూచించారు.