కేసీఆర్ కు ఆ అధికారం లేదు.. గతంలో జయలలితకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!!

 

తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది. 

ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.