నేను ఇప్పుడే బీఫ్ తింటా.. ఎవరేం చేస్తారు.. కర్ణాటక సీఎం
posted on Oct 30, 2015 1:16PM
గత కొద్దిరోజుల నుడి దేశ వ్యాప్తంగా బీఫ్ మాంసంపై పెద్ద పెద్ద వివాదాలే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదాల వల్ల చాలా మంది నేతలపై విమర్శలు.. కొంతమందిపై దాడులు కూడా జరిగిన సంగతి మనకు విదితమే. అయితే ఇప్పుడు ఈ వివాదాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను ఇంతవరకూ బీఫ్ ఎలా ఉంటుందో తినలేదని.. వీరు చేసే దానికి ఇప్పుడు బీఫ్ మాంసం తింటానని.. ఇప్పటికిప్పుడు తెచ్చుకుని తింటే ఎవరేం చేస్తారని సవాల్ విసిరారు. బెంగుళూరు టౌన్ హాల్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఏం తినాలన్నది అది తన ఇష్టమని.. ఒకరు తినే స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని.. ఎవరి ఇష్టం వచ్చింది వారు తింటారని వ్యాఖ్యానించారు. కాగా రెండు రోజుల క్రితం ఢిల్లీలోని కేరళ అతిధి గృహంలో బీఫ్ అమ్ముతున్నారంటూ పోలీసులు తనిఖీలు చేయడంతో అక్కడ పెద్ద దుమారమే రేగింది. పోలీసులు చేసిన తనిఖీలకు కేరళ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గెస్ట్ హౌస్‌లో ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పడానికి మీరెవరంటూ సూటిగా నిలదీశారు. ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నది పోలీసులా లేదంటే బీజేపీ కార్యకర్తలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.