బీజేపీ వైపు ఆనం అడుగులు?

 

ఆనం బ్రదర్స్.. నెల్లూరులో బలమైన రాజకీయ శక్తులుగా ఎదిగి.. రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆనం బ్రదర్స్, కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరారు.. టీడీపీలో కూడా ఆనం బ్రదర్స్ వాళ్ళ మార్క్ చూపించారు.. అయితే అనుకోకుండా ఆనం వివేకానంద రెడ్డి మరణించడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.. ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ మీద అసహనంతో వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు మొదలయ్యాయి.. ఇక అందరూ ఆనం ఈరోజో, రేపో వైసీపీలో చేరతాబోతున్నారు అనుకుంటుండగా.. ఇప్పుడు కొత్తగా మరో వార్త వినిపిస్తుంది.. అదే ఆనం బీజేపీ లో చేరబోతున్నారని..

ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. అప్పుడు కన్నా, ఆనం మధ్య మంచి స్నేహం ఉండేది.. ఆ స్నేహమే ఇప్పుడు ఆనం, బీజేపీ వైపు అడుగులు వేసేలా చేస్తుందంట.. ఆనం వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు రావడంతో బీజేపీ, కన్నాని రంగంలోకి దింపిందట.. కన్నా కూడా దానికి తగ్గట్టే పావులు కదిపి ఎలాగైనా ఆనంని బీజేపీలోకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.. మరి ఆనం రామనారాయణ రెడ్డి 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అంటూ కన్నా చెప్పినట్టు బీజేపీలో చేరతారా? లేక ముందు ఇచ్చిన మాట ప్రకారం వైసీపీలో చేరతారా?.. లేదా ఈ వార్తలన్నీ అవాస్తవం నేను టీడీపీలోనే ఉంటా అంటారా?.. ఆనం గురించి ఇలా రోజుకో వార్త వస్తుంటే.. అసలు ఆనం నిజంగా పార్టీ మారుతున్నారా? మారితే ఏ పార్టీలోకి వెళ్తారు? అంటూ నెల్లూరు ప్రజలే కాదు, తెలుగు ప్రజలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.. మరి ఆనం దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చూడాలి.