జగన్ కేసుల పురోగతిపై నివేదిక కోరిన హైకోర్టు

 

అక్రమాస్తుల కేసులో ఏకంగా 11 చార్జ్ షీట్లలో ఎ-1నిందితుడిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 16నెలలు జైల్లో గడిపిన తరువాత బెయిలుపై విడుధాలి బయటకు వచ్చారు. ఆ తరువాత మరి ఆయన అప్పుడప్పుడు విచారణ కోసం కోర్టుకి వెళ్లి వస్తున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ గతేడాది సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం ఆయన శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం వంటివన్నీ జరిగాయి. కానీ ఆయనపై మోపబడిన కేసుల విచారణ ఎంతవరకు వచ్చిందనే సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. కనుక విజయవాడకు చెందిన వేదవ్యాస్ అనే ఒక న్యాయవాది జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ కేసుల పురోగతిపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఒకవేళ హైకోర్టు స్వయంగా ఈకేసుల పురోగతిని పర్యవేక్షించడం మొదలుపెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి తదితరులకు ఊహించని కష్టాలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.