రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమా?

 

తెలంగాణాలో జరిగిన రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల జగన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటీ కాదు...రెండూ కాదు ఏకంగా 11 చార్జ్ షీట్లలో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్, రేవంత్ వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుని కూడా ఏ-1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేయడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. “త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది...మనకీ మళ్ళీ మంచిరోజులు వస్తాయి...మా పార్టీ అధికారంలోకి రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాము,” అంటూ జగన్ తరచూ పలికే మాటల్లో ముఖ్యమంత్రి అయిపోదామనే ఆయన తాపత్రయం స్పష్టంగా కనబడుతోంది.

 

రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి పదవులు, అధికారం సంపాదించుకోవాలని ఆశ పడటం నేరమేమీ కాదు. కానీ అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలు కూలిపోవాలని లేదా ఏదో విధంగా కూల్చివేయాలనుకోవడమే చాలా దారుణమయిన ఆలోచన. ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తానని బెదిరించి, చివరికి అన్నంత పనీ చేసి భంగపడిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశః అటువంటి ప్రయత్నమే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నట్లున్నారు. అందుకే జగన్ తనకు అసలు సంబంధం లేని వ్యవహారంలో చాలా చురుకుగా కదిలి గవర్నర్ నరసింహన్ న్ని కలిసి, తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై పిర్యాదు చేసినట్లు అనుమానిస్తున్నారు.

 

జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుండి ముఖ్యమంత్రి అవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే పార్టీని స్థాపించి విశ్వప్రయత్నాలు చేసారు. అయితే ఆయన తన నాయకత్వ లక్షణాలు చాటుకొని ప్రజలను మెప్పించి అధికారం కోసం ప్రయత్నించకుండా, తన తండ్రిపై ప్రజలలో ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేస్తూ, ఆయన ప్రవేశ పెట్టిన కొన్ని ఆకర్షణీయమయిన పధకాల గురించి చెప్పుకొని ఎన్నికలలో గెలవాలని ప్రయత్నించి భంగపడ్డారు. అందుకు తనను తాను నిందించుకోకపోగా చంద్రబాబు కారణంగానే తన ఆశలు అడియాసలయ్యాయని ఆయనే స్వయంగా చాలాసార్లు నిసిగ్గుగా చెప్పుకొన్నారు. అప్పటి నుండే ఆయన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తన శత్రువులుగా భావిస్తూ పోరాటాలు మొదలు పెట్టారు. కనుక ఆయన చేస్తున్న ఈ సమర దీక్షలు...పోరాటాలు అన్నీ కూడా కేవలం తెదేపాపై ప్రతీకారేచ్చతో చేస్తున్నవే తప్ప నిజంగా ప్రజల కోసం చేస్తున్నవి మాత్రం కాదని చెప్పవచ్చును.

 

ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల కోసం, వారి సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న వారికి మద్దతు ఇచ్చి, వారితో చేతులు కలిపి ఉండేవారు కాదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలకి, తన స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తునందునే ఆయన ఆవిధంగా చేస్తున్నారని అనుమానించక తప్పదు.

 

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు కదులుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నాలుగేళ్ల కాలంలో రాజధానికి రూపురేఖలు తీసుకువచ్చి, పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రాన్ని ఆర్ధిక సమస్యల నుండి  బయటపడేయగలిగినట్లయితే ఇక వచ్చే ఎన్నికలలో కూడా వైకాపా గెలిచే అవకాశాలు ఉండబోవని తేలికగానే ఊహించవచ్చును. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణంలో వైకాపా పాలుపంచుకోకపోవడానికి దానికి అడుగడుగునా అడ్డుపడటానికీ కారణం అదేనని భావించవచ్చును. బహుశః అందుకే ఆయన తన సమరదీక్షకు మంగళగిరిని వేదికగా ఎంచుకొన్నారని భావించవచ్చును..

 

అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు సహిస్తారు కానీ అధికార దాహంతో తాము ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఎవరయినా కుట్రలు పన్ని కూల్చాలని ప్రయత్నించినా, రాష్ట్రాభివృద్దికి ఆటంకాలు సృష్టించినా సహించబోరనే విషయం గతంలో చాలాసార్లు రుజువు చేసారు. వైకాపా కూడా మళ్ళీ అటువంటి పొరపాటే చేస్తే అందుకు ఆ పార్టీయే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.