రాజధాని విషయంలో వైసీపీ, బీజేపీ కలిసి గేమ్స్ ఆడుతున్నాయా?

 

రాజధాని విషయంలో కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ.. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైసీపీ సర్కార్ రాజధానిని మార్చే అవకాశముందని ప్రచారం మొదలైంది. ఒకవైపు అమరావతి ప్రాంత రైతులు.. ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం ఒకవైపు బొత్స వ్యాఖ్యలు సమర్ధిస్తూనే.. మరోవైపు రాజధాని మార్పు అనేది కేవలం ప్రచారం అని కొట్టి పారేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు రాజధానిపై కొత్త అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చన్న టీజీ వెంకటేష్.. ఏపీకి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. రాజధాని అంశంపై ఇప్పటికే సీఎం జగన్ బీజేపీ అధిష్టానంతో చర్చించారని, అందులో భాగంగానే నాలుగు రాజధానుల ప్రతిపాదన వచ్చిందని అన్నారు. ఈ విషయం తనకు బీజేపీ అధిష్టానమే చెప్పిందని టీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీజీ వెంకటేష్ బీజేపీ అధిష్టానం మాటనే తన మాటగా చెప్పారా? లేక ఈ మధ్య జనాల్లో తన పేరు అంతగా నానట్లేదని లైం లైట్ లోకి రావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు టీజీ వెంకటేష్ వ్యాఖ్యల వెనుక.. వైసీపీ ఉందా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీజీ వ్యాఖ్యలను రెండు తెలుగు ప్రధాన పత్రికలు వేరువేరు కోణాల్లో రాసుకొచ్చాయి. "రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరు.. రాజధాని నిర్మాణాన్ని కొనసాగివ్వబోమని, నాలుగు ప్రాంతాల్లో నాలుగు రాజధానులు పెట్టే యోచనలో వైసీపీ సర్కార్ ఉందని" టీజీ వ్యాఖ్యానించినట్టుగా ఈనాడులో ప్రచురితమైంది. సాక్షిలో మాత్రం.. "అమరావతిలో అభివృద్ధి శూన్యం, అక్కడ రాజధాని ఏర్పాటు స్థానికులకు ఇష్టంలేదు, అందుకే లోకేష్ ను ఓడించారని" అని టీజీ అన్నట్టుగా ప్రచురితమైంది. ఈ రెండిట్లో ఏది నిజం?. సరే రెండిట్లో వచ్చింది నిజమే అనుకుందాం. అసలు టీజీ వెంకటేష్ ఉన్నట్టుండి రాజధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు?. నిజంగానే రాజధానిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉందా? ఈ విషయం బీజేపీకి కూడా తెలుసా? రెండు కలిసే రాజధాని విషయంలో గేమ్స్ ఆడుతున్నాయా?. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి అంటున్నారు. చూద్దాం మరి ముందు ముందు ఎలాంటి ట్విస్ట్ లు వస్తాయో ఏంటో.