పవన్ కళ్యాణ్ బిగ్ మిస్టేక్ చేసారా?

 

వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు జరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే జరిగే అవకాశముంది. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ఏపీలో వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆ ప్రభావంతోనే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన 'ప్రత్యేక హోదా' మీద తొలి సంతకం పెడతామని హామీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ మీద ఏపీ ప్రజల్లో వ్యతిరేకత తగ్గింది. దీనివల్ల కాంగ్రెస్ కి కాస్త ఓటు శాతం పెరుగుతుంది కానీ.. మరీ సీట్లు గెలిచే అంత పుంజుకుంటుందని మాత్రం చెప్పలేం. ఇక బీజేపీది కూడా ఇంచుమించు కాంగ్రెస్ పరిస్థితే. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతు కూడా ఉండటంతో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకుంది. అయితే తరువాత ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయంలో యూ టర్న్ తీసుకుంది. దీంతో కాంగ్రెస్ లాగానే బీజేపీ కూడా ఏపీ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురైన అనుభవం ఎదురైనా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలుగా పోటీ చేసి తమ ఓటుబ్యాంకుని కాపాడుకుంటాయి తప్ప.. ఏపీలో అద్భుతాలు చేసే అవకాశంలేదు. అంటే ఇక ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్యే.

ఏపీలో అధికార పార్టీ టీడీపీ వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటి అధికారం నిలిబెట్టుకోవాలనుకుంటుంది. ఇక ప్రతిపక్ష వైసీపీ కూడా టీడీపీని ఎలాగైనా గద్దె దించి అధికారం పొందాలని చూస్తోంది. ఓ రకంగా టీడీపీతో నువ్వా నేనా అన్నట్టు పోరుకి సిద్ధమైంది. ఇక మిగిలింది జనసేన. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన ఇప్పుడు వామపక్షాలతో కలిసి టీడీపీ, వైసీపీల మీద పోరుకి సిద్దమైంది. ఇదే పవన్ కళ్యాణ్ చేస్తున్న బిగ్ మిస్టేక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వామపక్షాలు ఒకప్పటిలా కొద్ది స్థానాల్లో కూడా బలంగా లేవు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూశాం కదా. గతంలో కనీసం ఒకటి రెండు సీట్లైనా గెలిచే వామపక్షాలు ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం కూడా బాగా తగ్గిపోయింది. ఏపీలో కూడా వామపక్షాల పరిస్థితి అలాగే ఉంది. మరిప్పుడు పవన్ వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని సీట్లు వామపక్షాలకు కేటాయించాలి. మరి వామపక్షాల ఎంతవరకు ఆ సీట్లు గెలుచుకోగలవు?. ఒకవేళ ఓడిపోతే జనసేనకు ఆ సీట్లు నష్టమే కదా. అసలే జనసేన మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తుంది. మిగతా పార్టీలకు భిన్నంగా రాజకీయం చేయాలనుకుంటుంది. మరి మొదటిసారి పోటీ చేస్తున్న జనసేనకు ప్రతి సీటు ముఖ్యమే కదా. ఈ విషయం పవన్ కి కూడా తెలుసు. మరి పవన్ వామపక్షాలతో ఎందుకు కలిసి పని చేస్తున్నారంటే.. పవన్ రాజకీయ లాభం ఆశించి కాదు.. వామపక్షాల సిద్ధాంతాలు నచ్చి వాటితో కలిసి నడుస్తున్నారని జనసైనికులు అంటున్నారు. మరి పవన్ వామపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో? ఎన్ని సీట్లలో విజయాన్ని అందిస్తారో? చూడాలి.