మొన్న నాని, నిన్న నార్నె, నేడు వంశీ.. వైసీపీలోకి ఎన్టీఆర్ వర్గం.. పక్కా వ్యూహమేనా?

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. 2009 అసెంబ్లీ ఎన్నికలు. అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, వరుసగా రెండోసారి ప్రతిపక్షానికి పరిమితం కాకుండా ఉండాలని టీడీపీ, మరోవైపు మెగాస్టార్ పీఆర్పీ. ఇలా అధికారం కోసం పార్టీల హోరాహోరా పోటీ, హోరాహోరీ ప్రచారం. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రచారంలో ఓ కొత్త ఉత్సాహం కనిపించింది. ఆ ఉత్సాహం పేరే జూనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్.. పాతికేళ్లకే తన వాక్చాతుర్యంతో ప్రచారంలో దూసుకెళ్లారు. ఆయన ప్రచారానికి వచ్చిన విశేష స్పందన చూసి.. రాజకీయ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఎన్నికల ప్రచారం సమయంలోనే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయింది. అయినా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా టీడీపీకి ఓట్ వేయాలని కోరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా కూడా.. ఎన్టీఆర్ కి పార్టీలో, ముఖ్యంగా యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత కారణాలేమైనా టీడీపీకి, ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది.

తన ప్రచారానికి వచ్చిన స్పందన చూసి.. టీడీపీకి నేనే దిక్కు, నెక్స్ట్ సీఎంని నేనే అన్నట్టు ఎన్టీఆర్ ఫీలయ్యేవారని.. అందుకే ఎన్టీఆర్ ని టీడీపీ అధినాయకత్వం దూరం పెట్టిందని.. ఒక వర్గం చెప్పుకొచ్చింది. కాదు, ఎన్టీఆర్ కి వస్తున్న ఆదరణ చూసి భవిష్యత్తులో తన కుమారుడికి అడ్డుగా వస్తాడని చంద్రబాబే ఆయన్ని కావాలని దూరం పెట్టారని మరో వర్గం వాదన. నిజమేంటో తెలీదు కానీ ఎన్టీఆర్ కి, టీడీపీతో గ్యాప్ వచ్చిందనేది మాత్రం వాస్తవం. దీంతో టీడీపీలోని ఓ వర్గం ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు, చిరకాల మిత్రుడు కొడాలి నాని.. టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో.. ఎన్టీఆరే కొడాలి నానిని వైసీపీలోకి పంపించారని, ఎన్టీఆర్ వైసీపీకి మద్దతిస్తున్నారని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ మీద విమర్శలు కూడా తీవ్రతరమయ్యాయి. దీంతో ఎన్టీఆర్ మీడియా ముందుకొచ్చి.. కొడాలి నాని తనకు మిత్రుడే కానీ, పార్టీ మార్పు అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన నిర్ణయంతో నాకు సంబంధం లేదని, కట్టే కాలే వరకు టీడీపీ లోనే ఉంటానని స్పష్టం చేసారు. ఆ తరువాత ఎన్టీఆర్ తన దృష్టంతా కేవలం సినిమాల మీదే పెట్టారు. ఆయన మీద విమర్శలు కూడా తగ్గిపోయాయి.

సరిగ్గా పదేళ్ల తరువాత 2019 ఎన్నికల సమయంలో మళ్లీ ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో ఎన్టీఆర్ కి తెల్సే నార్నె శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లారని ప్రచారం మొదలైంది. అయితే నార్నె రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా లేకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. ఈ విషయాన్ని ఎవ్వరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా రాజకీయాలతో తనకేం సంబంధం లేనట్టు దూరంగా ఉంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కాదు కదా.. కనీసం టీడీపీకి ఓట్ వేయమని ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇక ఆయన ప్రస్తుతానికి సినిమాలకే పరిమితమయ్యారని అనుకున్నారంతా. అయితే అయన రాకపోయినా ఆయన పేరు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది.

తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ని కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం మొదలైంది. వంశీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. పార్టీ మార్పు అంశంపై దీపావళి తరువాత ప్రకటన చేస్తానన్నారు. అంటే పార్టీ మారే ఆలోచన ఉందని చెప్పకనే చెప్పేసారు. దీంతో ఎన్టీఆర్ పేరు మళ్లీ రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. కారణం, వంశీ.. కొడాలి నానికి చిరకాల మిత్రుడు. ఎన్టీఆర్ కి సన్నిహితుడు. దీంతో ఎన్టీఆర్ తెర వెనుక ఏదో చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ సన్నిహితులు ఒక్కఒక్కరిగా సైలెంట్ గా వైసీపీలో చేరుతుండంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్లానింగ్ ప్రకారమే తన వర్గాన్ని వైసీపీలోకి పంపి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నారని అంటున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ కూడా వైసీపీలో చేరినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొన్న కొడాలి నాని, నిన్న నార్నె శ్రీనివాస్, నేడు వంశీ.. ఎన్టీఆర్ సన్నిహితుల వైసీపీ బాట. మరి ఇది యాదృచ్చికమో, వ్యూహమో తెలీదు కానీ.. ఎన్టీఆర్ సన్నిహితులు వైసీపీలో చేరటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.