'మాజీ ఎంపీ కవిత రీఎంట్రీ' కోసం ఎదురుచూస్తున్న ఇందూరు ప్రజలు!!

 

టిఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ కవిత.. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఓటమిపాలైన తర్వాత పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటున్నారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాకే దూరంగా ఉంటున్నారని చెప్పాలి. వాస్తవంగా నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పటిష్టం కావడానికి కారణం కవితే. ఏ ఎన్నికలు వచ్చినా అన్నీ తానే చూసుకుంటూ పార్టీని గెలిపించుకుంటూ వచ్చే వారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ అభ్యర్ధుల విజయంలో కీలక పాత్ర పోషించి ఇందూరులో టీఆర్ఎస్ సత్తా చాటారు. అదే హవాను పార్లమెంటు ఎన్నికల్లో సైతం చూపాలని చూశారు. భారీ మెజార్టీతో గెలుపొందే విధంగా వ్యూహాలు సైతం రచించారు. అంతా బాగానే ఉన్న సమయంలో లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. అనుకోకుండా ఎగిసిపడ్డ పసుపు రైతుల ఉద్యమం అంచనాలను తలకిందులు చేసింది. అనూహ్యంగా బీజేపీ చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. 

ఆ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన రైతులకు ఏకంగా 90 వేల పైన ఓట్లొచ్చాయి. బీజేపీ అభ్యర్థి 69 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. వాస్తవంగా రైతులంతా టీఆర్ఎస్ కి ఓటు వేసేవారు అన్న అంచనా ఉంది. రైతుబంధు పథకం వారిని ఆ దిశగా నడిపించేది అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంలో రైతుబంధు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అదే రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కూతుర్ని ఓడించారు. ఏదేమైనా కవిత ఓటమి తర్వాత ప్రస్తుతం నిజామాబాద్ టీఆర్ఎస్ లో పెద్దగా కార్యక్రమాలు కనిపించటం లేదు. పార్టీలో సైలెంట్ వాతావరణం కనిపిస్తుంది. తరచూ పర్యటనలు కార్యక్రమాలతో హడావిడి చేసే కవిత లేనిలోటు జిల్లాలో టిఆర్ఎస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల తరువాత కవితా జిల్లాకు వచ్చిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారానికి రాలేదు, ఓటు మాత్రం వేసివెళ్ళారు. ఓటమి చెందినా ప్రజల్లోనే ఉంటానని కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మోపాల్లో కార్యకర్త చనిపోయిన సందర్భంలో చెప్పుకొచ్చారు. మాజీ ఎంపీ ఇదివరకటిలా స్థానికంగా పర్యటించకపోవడం.. అందుబాట్లో ఉండకపోతుండడం.. కార్యకర్తల్లో, పార్టీలో నైరాశ్యం నింపుతోందని గులాబీ నేతలు అంటున్నారు. ఇటు ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకే పరిమితం కావడం ఎవరికీ వారే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో పార్లమెంట్ నియోజకవర్గానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందంటున్నారు. 

కవిత ఇంకా ఓటమి ప్రభావం నుంచి తేరుకోలేకపోతున్నారు అన్న ప్రచారం జరుగుతుంది. కారణమేదైనా ఆమె ఇందూరు జిల్లాకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఒకవేళ వచ్చినా ఏ ఓ ప్రైవేట్ కార్యక్రమాలకు వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఉన్న కొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నేతలను కలవటానికే కవిత ఇష్టపడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏదైనా పదవి చేపట్టి మళ్లీ జిల్లాలో పూర్తిస్థాయిలో రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో కవిత ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి కవితకు ఇప్పటికే రిజర్వ్ అయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ పదవి తీసుకున్న తర్వాత ఆమె మళ్లీ జిల్లాలో యాక్టివ్ రోల్ పోషించే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత రీఎంట్రీ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై ఒక టీఆర్ఎస్ లోనే కాదు అన్ని పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే కవిత రీఎంట్రీపై గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయంశంగా మారింది.