లోపం నీలోనే ఉంటే....

 

అతను ఓ కోపధారి మనిషి. ఎదుటి మనిషి మాటలో కానీ, కదలికలో కానీ ఏమాత్రం తేడా తోచినా తెగ విరుచుకుపడిపోయేవాడు. అలా రోజూ ఏదో ఒక గొడవ పెట్టుకొని కానీ ఇంటికి చేరుకునేవాడు కాదు.  వయసు గడిచేకొద్దీ ఆ కోపధారి మనిషిలో పశ్చాత్తాపం మొదలైంది. ‘రోజూ అసహ్యంగా ఏమిటీ గొడవలు’ అనుకున్నాడు. అంతే! కొన్నాళ్లపాటు ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవాలని అనుకున్నాడు. తన కోపం తగ్గేదాకా ఇంట్లో ఉండి ఆ తరువాత సమాజంలోనికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ...

 

ఓ నాలుగు రోజులు గడిచిన తరువాత అతనిలో సహనం నశించింది. ఇంట్లో భార్యాబిడ్డలతో ఏదో ఒక విషయం మీద వాదన మొదలుపెట్టసాగాడు. ‘మీరు బయటకి వెళ్తేనే మా బతుకులు ప్రశాంతంగా ఉండేవి,’ అని వారి చేత ఛీ కొట్టించుకున్నాడు. దాంతో ఆ కోపధారి మనిషికి తన కోపం మీదే మా చెడ్డ కోపం వచ్చింది. అంతే! వెంటనే ఇల్లూ వాకిలీ విడిచిపెట్టేసి ఓ ఆశ్రమంలో చేరిపోయాడు.

 

కోపధారి మనిషికి ఆశ్రమంలో అంతా బాగున్నట్లుగా తోచింది. వేళకి భోజనం, వేళకి నిద్ర.... ప్రతి ఒక్కరికీ స్థిరమైన బాధ్యతలు. ఆ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పెద్దస్వాములు. అంతా ఓ పద్ధతి ప్రకారం సాగిపోతున్నట్లుగా అనిపించింది. తను కూడా ఆశ్రమ అధికారులు అప్పగించిన బాధ్యతలను బుద్ధిగా నెరవేచ్చసాగాడు. నియమం తప్పకుండా ధ్యానం చేసేవాడు. మనసులో ఒకటే ప్రశాంతత! కొన్నాళ్లకి అతనికి వంటింటి బాధ్యతల అప్పగించారు ఆశ్రమంవారు. ఇక అక్కడి నుంచీ కథ అడ్డం తిరిగింది. తోట వంటవారితో ఉప్పులు, పప్పులు దగ్గర గొడవలు మొదలయ్యాయి. ఎసరు ఎక్కువైందనీ, తాలింపు మాడిపోయిందనీ కొట్లాటకు దిగసాగాడు. ఇప్పుడు అతనిలోని కోపధారి మళ్లీ బయటకి వచ్చేసాడు.

 

‘ఉహూ! ఇదంతా లాభం లేదు. అసలు మనుషులే లేని చోటకి వెళ్లిపోతాను. నరమానవుడు కనిపించని చోట తపస్సు చేసుకుని నా మనసుని మార్చుకుంటాను,’ అనుకున్నాడు కోపధారి. అందుకోసం ఎవరూ లేని ఓ దుర్గమ అరణ్యంలోకి చొచ్చుకుపోయాడు. అక్కడ అతనికి ఎటుచూసినా ప్రశాంతతే కనిపించింది. పక్షుల కిలకలారావాలు, కుందేళ్ల పరుగుల మధ్య అదో భూతల స్వర్గాన్ని తలపించింది.

 

ఆ అడవిలో నిజంగానే అతని మనసు ప్రశాంతతలో మునిగిపోయింది. ఓపిక ఉన్నంతసేపూ ఓ చెట్టు కింద కూర్చుని గంటల తరబడి ధ్యానం చేసుకునేవాడు. ఆకలి వేస్తే ఏవో పండ్లు తినేవాడు. భయం వేస్తే చెట్టు మీదకి ఎక్కి దాక్కొనేవాడు. దాహం వేస్తే దగ్గరలో ఉన్న సెలయేరు దగ్గరకి ఒక చిన్న కుండ తీసుకువెళ్లి నీళ్లు తెచ్చుకునేవాడు. అలా ఓ రోజూ కుండ తీసుకుని సెలయేటి దగ్గరకి వెళ్లాడు కోపధారి. కుండలో నీరు నింపి దాన్ని పక్కన పెట్టి, తాను స్నానానికి ఉపక్రమించాడు. ఆ కుండ తటాలున పక్కకి ఒరిగిపోయింది. అందులో నీళ్లన్నీ ఒలికిపోయాయి. దాంతో మళ్లీ కుండని నింపి గట్టు మీద పెట్టాడు. అదేం దరిద్రమో... మళ్లీ కుండ కాస్తా పక్కకి ఒరిగిపోయింది.

 

ఆ రోజు విపరీతమైన గాలి వీస్తున్నట్లుంది. ఎందుకంటే ఇంకో నాలుగైదు సార్లు అలా కుండని నింపి పెట్టినా కానీ... అతను నీటిలోకి దిగేసరికి అది పక్కకి ఒరిగిపోయేది. దాంతో కోపధారి మనసు ఒక్కసారిగా కుతకుతలాడిపోయింది. ఆ కుండని తీసుకుని నేలకేసి కొట్టాడు. తన కసితీరా దానిని కాలితో తొక్కాడు. ఇన్ని రోజులుగా అతని మనసులో అణచుకున్న ఉద్వేగాలన్నింటినీ ఆ కుండపెంకుల మీద చూపాడు. అలా వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, ఆ తరువాత పొడిపొడిగా నలిపేసిన తరువాత కానీ అతనిలోని కోపం చల్లారలేదు. ఆ కోపం తగ్గిన తరువాత అతనిలో ఎందుకో ఓ ఆలోచన మొదలైంది...’లోపం నా చుట్టూ లేదు, నాలోనే ఉంది. అందుకని నా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తప్పించుకుని ఉపయోగం లేదు. నా నుంచి నేను పారిపోలేను కదా! కాబట్టి నన్ను నేనే మార్చుకోవాలి,’ అనుకుంటూ ఇంటిబాట పట్టాడు.


(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.