అంతరంగంలోనే సంతోషాల నిధి...

 

సంతోషంగా వుండాలి. ఇదే అందరి కోరిక. అలా సంతోషంగా వుండాలంటే ఏమి కావాలి? ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తారు. ఏవేవో సూత్రాలు, ప్రణాళికలు చెబుతారు, వింటారు. సంతోషంగా వుండటం ఎలా అని నాలాగా ఎవరైనా వాళ్ళకి తోచింది రాస్తే అర్జెంటుగా చదివేస్తారు ఏమన్నా సీక్రెట్ తెలుస్తుందేమో అని. సంతోషపు నిధి తాళం దొరుకుతుందేమో అని. కానీ, దానికి యూనివర్సల్ సూత్రాలు అంటూ ఏవి వుండవు. వ్యక్తికీ వ్యక్తికి అవి మారిపోతుంటాయి. వాళ్ళవాళ్ళ మనస్తత్వాల బట్టి.

ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, లోపలి నుంచి నమ్మనిది ఏదీ ఆచరణలో కలకాలం నిలవదు. అందుకే ఒక్కసారి లోపలి నుంచి తర్కించి చూసుకోండి, అంతర్ముఖులుగా మారండి, మీతో మీరు వాదించుకోండి. ఏది నిజంగా మీకు సంతోషాన్ని ఇస్తుంది అన్నది తెలుసుకోండి. గుర్తించండి. 

అర్జెంటుగా ఈ విషయం కోసం ఇంత ఆలోచించాలా? అనిపిస్తే ఒక్క ప్రశ్న వేసుకోండి! ఇప్పుడు నేను సంతోషంగా వున్నానా? దానికి సమాధానం టక్కున అవును అని వస్తే సరే. లేదంటే తరచి చూసుకునే పని మొదలు పెట్టండి. "సంతోషం గా ఉండటానికి చాలా చాలా కావాలి, అవన్నీ వుంటే అప్పుడు పూర్తి సంతోషం నా స్వంతం" అంటూ చాలా లిస్టు చెబుతారుచాలా మంది. కానీ ఓటి కుండ ఎప్పుడూ నిండదు  అంటారే అలానే సంతోషంగా ఉండటమన్నది మన ఛాయస్ తప్ప అది ఛాన్స్ కానేకాదని తెలియని వారికి ఇప్పుడే కాదు వాళ్ళు కోరినవన్నీ దొరికినా సంతోషం మాత్రం దరిచేరదు. జీవితాన్ని జీవించటం అంటారు చూసారా? అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ , ఆనందిస్తూ, ఆ ఆనందాన్ని వేరొకరికి కూడా పంచుతూ అలా జీవించే వాళ్ళకి సంతోషం ' ఐ లవ్ యు ' అంటూ తోడుగా నిలిచిపోతుంది.

అంతర్ముఖులు కావటం అవసరం అని ఇందాక చెప్పుకున్నాం కదా ! ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక్కరే కూర్చుని, ప్రకృతితో మమేకం అవుతూ, ఏ ఆలోచనలూ లేకుండా ఒక్క రెండు నిముషాలు గడిపి చూడండి. మన లోపలకి మనం చేసే జర్నీనే అతి కష్టమయినది. అది చేయగలిగితే చాలు జీవిత ప్రయాణం ఏంతో  సులువు. ఆ జర్నీలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి., జవాబులు ఎలా అనుకోవద్దు, ఎందుకంటే మన లోపలి శక్తికి అన్ని ప్రశ్నలకి సమధానం తెలుసు. కళ్ళు మూసుకోగానే నిజనిజాలని మన ముందు ఉంచుతుంది. మనం చేయాల్సిందల్లా ఆ లోపలి శక్తిని పలకరించటమే. ఒక్కసారి ఆ లోపలిదాకా  ప్రయాణం చేసి వస్తే చాలు. ఏవీ సమస్యలుగా కనిపించవు, ఎవరూ శత్రువులుగా తోచరు. ఈ రెండు లేకపోతే చాలు సంతోషం పరిగెట్టుకు వచ్చేస్తుంది. చకచకా పరుగులు పెడుతూ, బడ బడా మాట్లాడేస్తూ , ప్రపంచంతో ఎంతో మమేకం  అయిపోతూ మనకి మనం దూరం అయిపోతున్నాం.  మన లోపలి మనిషిని ఒంటరిని చేసేస్తున్నాం. సంతోషం చిరునామా తెలియలేదంటూ వాపోతున్నాం. మనలోనే వున్న దాని కోసం బయటి ప్రపంచమంతా వెతుకుతున్నాం.

-రమ