పట్టు వదలని శ్రీలక్ష్మి.. ఏకంగా కేడర్ నే మార్చుకున్నారు 

ఏపీ సీఎం గా జగన్ పదవి చేపట్టగానే ఇద్దరు తెలంగాణ కేడర్ అధికారులను ఏపీకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. వారిలో ఒకరు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కాగా మరొకరు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర. ఈ ఇద్దరు అధికారులు గతంలో ఉమ్మడి ఏపీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ముఖ్యమైన పదవులలో పని చేసారు. దీంతో ఇటు సీఎం జగన్ కూడా ఆ అధికారుల డిప్యుటేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెల్సిందే. ఐతే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అప్పట్లో అది సాధ్యం కాలేదు.

 

అయితే సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రం పట్టు వదలకుండా తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు ఏకంగా తన కేడర్ ను ఏపీకి మార్చుకున్నారు. మొదట్లో డిప్యూటేషన్ మీద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆమె ప్రయత్నించారు. అయితే ఆమె ప్రత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఆమె తన తెలంగాణ క్యాడర్‌ను త్యాగం చేసేసి.. ఏపీ కేడర్ కు మారిపోయారు. ఏమైనా సరే ఏపీకి వెళ్లిపోవాలని నిశ్చయించిన ఆమె తన కేడర్ ను మార్చుకునేందుకు క్యాట్‌ను ఆశ్రయించారు. తమది అసలు స్వతహాగా ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా అని.. అయితే తమ తండ్రి రైల్వే అధికారి కావడంతో వృత్తిరీత్యా తెలంగాణకు వెళ్లామని, రాష్ట్ర విభజన సమయంలో తన పోస్టల్ చిరునామా ఆధారంగా తెలంగాణ కేడర్ కు కేటాయించారని ఆమె క్యాట్ కు విన్నవించుకున్నారు. దీంతో తనకు తన సొంత రాష్ట్రాన్ని కేటాయించాల్సిందేనని ఆమె క్యాట్ ముందు వాదించారు. దీంతో ఈ వాదనలు విన్న క్యాట్ ఆమె వాదనను అంగీకరించి ఏపీ కేడర్ ను కేటాయించింది. దీంతో ఆమె నిన్న శుక్రవారం అమరావతిలోని ఏపీ జీఎడీలో రిపోర్టు కూడా చేశారు.

 

అయితే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని తీవ్రంగా కెరీర్ నష్టపోయిన ఐఏఎస్ లలో శ్రీలక్ష్మి ఒకరు. అతి చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన ఆమె… ఆ కేసుల్లో ఇరుక్కోకపోతే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా అత్యధిక కాలం పని చేసే అధికారిగా రికార్డు సృష్టించేవారు. అయితే కేసుల్లో ఇరుక్కోవడంతో ఆమె పదోన్నతులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు… ఆమె ఏపీకి రావడంతో సీఎం జగన్ సీఎంఓలో అత్యంత కీలకమైన పదవి ఇస్తారని అంచనా వేస్తున్నారు. తాజాగా శ్రీలక్ష్మి ఏపీ కేడర్ కు మారిపోవడంతో ఏపీ అధికార వర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.