Top Stories

తెలుగుదేశం పగ్గాలు లోకేష్ కు.. పిఠాపురం వర్మ తాజా డిమాండ్

పిఠాపురం వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపుతు తిరుగుతున్నాయి. గత ఎన్నికలలో కూటమి ధర్మానికి కట్టుబడి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తరువాత జరిగిన పరిణామాల పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులే  కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతోంది. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో నాగబాబు చేసిన కర్మ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పిఠాపురం వర్మకు ఆహ్వానం అందలేదు. అయితే నాగబాబు పర్యటన ఆద్యంతం తెలుగుదేశం క్యాడర్ వర్మ అనుకూల నినాదాలు చేశారు. వాస్తవానికి పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు అప్పట్లో ఇచ్చిన మేరకు ఎమ్మెల్సీ పదవి   ఇప్పటి వరకు దక్కలేదు. నాగబాబు జనసేన సభలో వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. నాగబాబు పర్యటన వేళ వర్మ మద్దత దారులు, తెలుగుదేశం క్యాడర్ నిరసనలు చేశారు.  వర్మను ఆహ్వానించకుండా నాగబాబు కార్యక్రమాల్లో పాల్గొనటం పై ఆందోళన వ్యక్తం చేసారు. నాగబాబు చేసిన వ్యాఖ్యల తరువాత పిఠాపురంలో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గతంగా రచ్చ సాగుతున్నా, ఇప్పటి వరకూ  ఇటు తెలుగుదేశం అధినాయకత్వం కానీ, అటు జనసేనాని కానీ స్పందించలేదు.   ఈ నేపథ్యంలో పిఠాపురం వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకీ ఆయన అన్నదేమిటంటే.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను నారా లోకేష్ చేపట్టాలని. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్మ వైఖరి ఏమిటన్న చర్చకు తెరతీశాయి. అదలా ఉంచితే..  గతంలో కూడా పిఠాపురం వర్మ  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు.   కాకినాడ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో బుధవారం (ఏప్రిల్ 9) మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయకత్వం అవసరమన్నారు.  యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆయన నూతనోత్సాహాన్ని నింపారనీ, అంతే కాకుండా అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాలుపంచుకోని సీనియర్లంతా అనివార్యంగా బయటకు వచ్చి ప్రజలలో మమేకం అయ్యేలా చేశారనీ  అన్నారు. విజన్ 2047తో పాటుగా పార్టీ భవిష్యత్ కోసం కూడా 2047 ప్రణాళికను రూపొందించాలని పిఠాపురం వర్మ అన్నారు.  
తెలుగుదేశం పగ్గాలు లోకేష్ కు.. పిఠాపురం వర్మ తాజా డిమాండ్ Publish Date: Apr 9, 2025 5:49PM

 వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ

వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.  గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని నిందితుడు.  ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ  సిఐడి ప్రత్యేక న్యాయస్థానం  తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది.  బుధవారం నాడు ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 9 మందిని  కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో పలుమార్లు రిమాండ్ ను పొడిగించిన న్యాయస్థానం మరో మారు పొడిగించడంతో వంశీ షాక్ లో ఉన్నారు. ఆయన పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తుచేస్తున్నప్పటికీ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం లేదు. టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో కూడా వంశీ నిందితుడు.
 వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ Publish Date: Apr 9, 2025 5:42PM

తైవాన్‌లో మళ్లీ భూకంపం

వరుస భూకంపాలతో తైవాన్ బెంబేలెత్తిపోతున్నది.  గత నెల 28న సంభవించిన భూకంపం సృష్టించిన విలయం నుంచీ, మారణహోంమ నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం (ఏప్రిల్ 9) మరోసారి తైవాన్ లో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. గత నెల 28న 7.7 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అప్పటి భూకంపంలో 3600 మందికి పైగా మరణించారు. మరో 5 వేల 17 మంది గాయపడినట్లు తైవాన్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ మరో 160 మంది జాడ తెలియల్సి ఉందని పేర్కొంది. ఆ భూకంపానికి సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే తాజాగా మరోసారి భూకంపం సంభవించడంతో జనం భయాందోళనలకు గురౌతున్నారు. బుధవారం (ఏప్రిల్ 9)న కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   ఈశాన్య తీరంలోని యిలాన్‌కు ఆగ్నేయంగా 21 కిలోమీటర్లు దూరంలో భూమికి 69 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.  కు సిబ్బంది సహకారం అందించారన్నారు.
తైవాన్‌లో మళ్లీ భూకంపం Publish Date: Apr 9, 2025 4:43PM

జగన్ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపోరాటం.. పోలీసు అధికారలు సంఘం హెచ్చరిక

రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామని జగన్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. బట్టలూడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీసులు ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారన్న ఆయన జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీసులు జనం కోసం పని చేస్తున్నారు తప్ప జగన్ వంటి నేతల కోసం కాదని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేవలం రాజకీయ మైలేజ్ కోసం జగన్ తీపత్రేయపడుతున్నారని జనకుల శ్రీనివాస్ అన్నారు.  పోలీసు యూనిఫారం ఉక్కు కవచం వంటిదనీ, రాజ్యాంగ హక్కును కాపాడేదనీ చెప్పిన ఆయన జగన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  లేకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.   అంతకు ముందు జగన్ వ్యాఖ్యలను రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు యూనిఫారం జగన్ ఇస్తే వేసుకున్నది కాదు, కష్టపడి చదివి సాధించినది, ఎవడో వచ్చి ఊడదీస్తామనడానికి ఇదేమీ అరటి తొక్క కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు. పోలీసు యూనిఫారంలో ఉండి చేసిన ఈ వీడియోలో నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా ఛస్తాం అంతే కానీ ఎవడి కోసమో అడ్డదారులు తొక్కమంటూ సీరియస్ గా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్ ను హెచ్చరించారు.  
జగన్ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపోరాటం.. పోలీసు అధికారలు సంఘం హెచ్చరిక Publish Date: Apr 9, 2025 4:28PM

ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం... ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. అతని పాస్ పోర్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారి అయ్యాయి. ఈ విషయాన్ని సిట్ అధికారులకు సిబిఐ సమాచారమిచ్చింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ప్రభాకర్ రావు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే మకాంవేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం అపఖ్యాతిని మూట గట్టుకుంది. 
ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం... ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు  Publish Date: Apr 9, 2025 4:18PM

జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. జగ్గారెడ్డి మల్టీరోల్స్!

జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. పాలిటిక్స్‌కు టెంపరరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ ఉంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లు ఎక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పార్టీని, పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ లు పెట్టి మైకును మోత మోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారోనని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు పయనం అయ్యారు. ఆ టూర్‌లోనే జగ్గారెడ్డిలో నిర్వేదం వచ్చి, కొత్త కొత్త అవతారాలు బయటపడుతున్నాయంట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్‌గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్‌ని రివీల్ చేస్తున్నారు.  వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్‌ని పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతున్నది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రాం మందిరంలో రామభజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్‌ని పక్కన పెట్టి సంగారెడ్డిలో పండుగలు, భజనల్లో బిజీగా ఉన్నారంట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హొలీ వేడుకల్నీ అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న, పెద్ద, మిత్రులు, అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హొలీ అయ్యిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.  అది అయిపోగానే ఉగాది వేడుకలు, శ్రీ రామ నవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేరాఫ్ జగ్గారెడ్డి  అనే విధంగా హడావుడి చేస్తున్నారంట. ఇక ఇన్నాళ్లు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ క్యారెక్టర్ యాక్టర్‌గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్తా భక్తిలో జగ్గానంద స్వామిగా మారడం... సినిమాలో జగ్గూభాయ్‌లా ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరులు ఖుషీలో ఉన్నా కాస్త కన్ఫ్యూజ్‌లో పడ్డారట.   పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనని అనుచర గణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరి కొందరు మార్పు వెనుక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారు. ఎప్పుడూ రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి.. మౌనంతోను రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారిప్పుడు. మరి రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్ళీ పొలిటికల్‌గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.
 జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. జగ్గారెడ్డి మల్టీరోల్స్! Publish Date: Apr 9, 2025 4:00PM

అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  అమరావతి నుండి హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించిన  సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని కేంద్రం రోడ్డు రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సూచించింది.    గత నెల 3న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఏపీ ఎస్‌ఎఫ్‌సీ విభజన, విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయ ప్రాజెక్టులు, అప్పుల పంపకం, రోడ్డు, రైలు, విద్యా సహా పలు అంశాలపై ఈ సమావేశం చర్చించింది.  ఇరు రాష్ట్రాల మధ్యా అపరిష్కృత అంశాలపై రెండు రాష్ట్రాల  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపింది. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.  రెండేళ్లలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని రైల్వే బోర్డు ప్రకటించింది.   వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంట్‌కు సంబంధించి ఏపీకి పెండింగ్ ఉన్న మరో రూ.350 కోట్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక వ్యవసాయశాఖ వెల్లడించింది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక అందిందని, కొద్ది రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్టు అందుతుందని దాని ఆధారంగా ముందకు వెళతామని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.  
అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Publish Date: Apr 9, 2025 3:35PM

క్రాప్ హాలీడే.. ఆక్వా రైతుల నిర్ణయం

ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో దారుణంగా నష్టపోతున్న రొయ్యాల రైతులు అక్వా సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆక్వా సంఘాలూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 1 తరువాతే సీడ్ స్టాకింగ్ ఆరంభించనున్నట్లు ప్రకటించాయి. రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై భీమవరంలో మంగళవారం (ఏప్రిల్ 8)న జరిగిన అక్వారైతుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచీ ఆక్వారైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రొయ్యల మేత నుంచి మద్దతు ధర వరకూ అన్ని విధాలుగా తమకు అన్యాయం జరుగుతోందని ఈ సమావేశంలో రొయ్యల సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు సెలవు ప్రకటించారు. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ వచ్చిన రైతులు స్పష్టం చేశారు.   
క్రాప్ హాలీడే.. ఆక్వా రైతుల నిర్ణయం Publish Date: Apr 9, 2025 3:16PM

మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డి.. ఫెవికాల్ బంధం

మెట్రో రైలు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని తెలంగాణ సర్కార్ తిరిగి అదే నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ బుధవారం (ఏప్రిల్ 9) ఉత్తర్వలు జారీ చేశారు. మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా  కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.     ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రీ అపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో కొనసాగుతున్న వారిని తెలంగాణ సర్కార్ ఇటీవలే తొలగించిన సంగతి తెలిసిందే. అలా తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే   మెట్రో సెకండ్ ఫేజ్  సత్వరమే, సజావుగా సాగాలంటే ఎన్వీఎస్  రెడ్డి సేవలు కీలకం, అత్యవసరం అని భావించి ఆయనను తిరిగి నియమించింది. 
మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డి.. ఫెవికాల్ బంధం Publish Date: Apr 9, 2025 3:02PM

పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి: ఖర్గే 

ఎఐసిసి చీఫ్ మల్లి ఖార్జున్ ఖర్గే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్ట పడి పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని నేతలపై చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమైంది.  కష్టపడి పని చేసే వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు ఖర్గే చెప్పారు. బాధ్యతలు తీసుకోనివారు విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో   ఖర్గే మాట్లాడారు. బిజెపి మతకలహాలను ప్రోత్సహించిందన్నారు. ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే బిజెపిని గద్దెదించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.  కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి పిలుపు నిచ్చింది. ప్రధాని మోది స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. 
పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి: ఖర్గే  Publish Date: Apr 9, 2025 2:45PM

అమరావతిలో బాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి బుధవారం (ఏప్రిల్ 9) భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు.  వేద పండితుల ఆధ్వర్యంలో  ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది. సచివాలయం వెనుక ఇ9  రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది.రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది. 2024 డిసెంబరులో చంద్రబాబు ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం ఐదు ఎకరాల  రెసిడెన్షియల్ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు.  ఇటీవలే రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఐదు రోజుల కిందటే భూమి చదును పనులు  చేపట్టారు. ఆ పనులు మంగళవారం (ఏప్రిల్ 8)తో పార్తయ్యాయి. దీంతో బుధవారం (ఏప్రిల్ 9) భూమి పూజ నిర్వహించారు.  ఇంటి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇలా ఉండగా కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజపై నారా బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా స్పందించారు.  పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నూతన అధ్యాయానికి ఇది ప్రారంభం అని పేర్కొన్నారు. 
అమరావతిలో  బాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ Publish Date: Apr 9, 2025 2:39PM

కొడుకు ను చూసి పవన్ కళ్యాణ్ భావో ద్వేగం

సింగపూర్ లో ఐసియులో కొడుకు మార్క్ శంకర్ ఉండటాన్ని చూసి ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుక్కున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో బెడ్ పై కొడుకు ను చూసి పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట చిరు దంపతులు కూడా ఉన్నారు. కొడుకు మార్క్ శంకర్ కు సింగపూర్ వైద్యులు బ్రాంకోస్కోపి చేశారు. ప్రస్తుతం  శంకర్ ఆరోగ్యం నిలకడగా  ఉంది. కొడుకు ను చూసిన తర్వాత  పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుక్కున్నసమయంలో స్పందించిన నేతలకు పవన్ కళ్యాణ్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. నా పెద్ద కొడుకు అకీరా  పుట్టిన రోజు నాడే  నా చిన్న కుమారుడు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలకు గురైన సంగతి తెలిసిందే 
కొడుకు ను చూసి పవన్ కళ్యాణ్ భావో ద్వేగం Publish Date: Apr 9, 2025 2:16PM

భారత్ కు ముంబై పేలుళ్ల సూత్రధారి రాణా!

కరుడుగట్టిన తీవ్రవాది తహవ్యూర్ రాణాను అమెరికా నుంచి రప్పించడంలో భారత్ విజయం సాధించింది. 2008 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అయిన  తహవ్వూర్ రాణా గురువారం  (ఏప్రిల్ 10) తెల్లవారు జామున అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.  నిఘా, దర్యాప్తు సంస్థల అధికారుల ప్రత్యేక బృందం స్పెషల్ ఫ్లైట్ లో రాణాను అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకురానున్నది.  భారత్‌కు చేరుకున్న వెంటనే రాణాను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ మొత్తం వ్యవహారమంతా  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది.  పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడియన్   రాణా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా  లో  కీలక పాత్రధారి. ముంబైలోని కీలక లక్ష్యాలపై దాడులకు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి రాణా సహకరించారు. అలాగే రాణా సహకారంతోనే   ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడ్డారు. 2008 ముంబై ఉగ్రదాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాటి దాడిలో పాల్గొన్న కసబ్ ను సజీవంగా పట్టుకున్న భద్రతా దళాలు మిగిలిన ఉగ్రవాదులను   మట్టుబెట్టాయి.  అనంతరం కసబ్ ను కూడా విచారణ అనంతరం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఉరి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల వెనుక సూత్రధారి అయిన రాణా అప్పటి నుంచీ అమెరికాలో తలదాచు కుంటున్నారు. అతడిని తమకు అప్పగించాల్సిందిగా భారత్ అమెరికాను కోరి అందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టింది.   రాణా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ ఫర్మ్ చేసినా,  భారత్‌కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ  రాణా   అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు ఆ పిటిషన్ ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేయడంతో రాణా అమెరికా నుంచి భారత్ కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది.  
భారత్ కు ముంబై పేలుళ్ల సూత్రధారి రాణా! Publish Date: Apr 9, 2025 2:15PM

జగన్ కోటరీ నుంచి సజ్జల ఔట్?

జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతెందుకు జగన్ ను కలవాటంటే ముందుగా ఆయనను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? అక్కడికే వస్తున్నా.. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు.   ఇంత ప్రాముఖ్యత ఉందని సజ్జల అప్పటి ముఖ్యమంత్రి   జగన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేట్, రూమ్మేట్టో, క్లాస్ మేటో.. ఇంకా చెప్పాలంటే  జైల్ మేటో కూడా కాదు. ఎంపీ కాదు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాదు. వాస్తవానికి ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచే మీడియాకు చేరతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్ లో కూడా సజ్జల మాటే ఫైనల్ అన్నట్లుగా అప్పట్లో ఆయన హవా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కాదు, పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే నడిచేవి. ఇప్పటికీ పార్టీ వ్యవహారాలలో ఆయనే కీలకం అనడంలో సందేహం లేదు.    అయితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. సజ్జల రామకృష్ణారెడ్డి పై పార్టీ నేతలు, కేడర్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ ఓటమికి ఆయన, ఆయన పుత్రరత్నం, వైసీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్ సజ్జల భార్గవరెడ్డే కారణమంటూ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. జగన్ కూడా పిల్ల సజ్జలను అదేనండీ సజ్జల భార్గవ్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి ఊస్ట్ చేసి పారేశారు. పరాజయం తరువాత తొలి నాళ్లలలో సజ్జలను కూడా దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత అదేమీ లేదు.. ఇప్పటికీ సజ్జలే పార్టీ వ్యవహారాలలో ఫైనల్ డెసిషన్ మేకర్ గా ఉన్నారు.  అయితే ఎప్పుడైతే సజ్జలకు ముందు పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగి, ఆ తరువాత మసకబారిపోయి, పార్టీ ఓటమి తరువాత వైసీపీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి.. మీడియా సమావేశంలో జగన్ కోటరీపై చేసిన వ్యాఖ్యల తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు నుంచే కాకుండా తన కోటరీ నుంచి కూడా జగన్ సజ్జలను సాగనంపేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల స్థానంలో పులివెందులకు చెందిన సింగారెడ్డి సతీష్ రెడ్డిని తీసుకురానున్నారని పార్టీ వర్గాల సమాచారం.   అయితే ఈ వార్తలలో నిజమెంత అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవు తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకూ ఈ సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి పులివెందులలో ప్రధాన ప్రత్యర్థి అనే చెప్పాలి. ఆయన మొదటి నుంచీ కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేశారు. తెలుగుదేశంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతెందుకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైస్ కు, జగన్ కు 1999 నుంచి 2014 వరకూప్రత్యర్థిగా నాలుగు సార్లు ఎన్నికలలో పోటీ చేశారు. ఆ నాలుగు సార్లూ ఓడిపోయారనుకోండి అది వేరే సంగతి.   తొలి నుంచీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీతోనే ఉణ్న సతీష్ రెడ్డి 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు.  2011, 2014లలో ఆయన తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా వేంపల్లి ఆయన స్వస్థలం. తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం సతీష్ రెడ్డి వైస్ కుటుంబానికి వ్యతిరేకంగానే పని చేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీ పంచన చేరారు. ఇందుకు ప్రధాన కారణంగా పార్టీలో బీటెక్ రవికి పెరిగిన ప్రాధాన్యతే అని ఆయన సన్నిహితులు చెబుతారు.   సుదీర్ఘ కాలం తెలుగుదేశంలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డిని జగన్ విశ్వసించి వైసీపీలో అత్యంత ప్రాధాన్యమైన పోస్టు ఇస్తారా? అన్న అనుమానాలు రాజకీయవర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.  
జగన్ కోటరీ నుంచి సజ్జల ఔట్? Publish Date: Apr 9, 2025 1:09PM

 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ నేత క్రిషాంక్ విచారణ

కంచె గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్శిటీ భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో దుష్  ప్రచారం చేసిన  కేసులో బిఆర్ఎస్ నేతలు   క్రిషాంక్, దిలీప్ లను బుధవారం గచ్చిబౌలి పోలీసులు విచారణ చేస్తున్నారు. మూడు రోజుల పాటు విచారణ ఎదుర్కోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో  కూడా వీరు నిందితులు. మార్పిడి ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నట్లు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు వీరిపై కేసులు నమోదయ్యాయి. ఎఐ ఫోటోలను  తయారు చేసి ప్రచారం చేసినట్లు  వీరిపై అభియోగాలున్నాయి. బిఆర్ఎస్ నేతలు కెటిఆర్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టాండన్ లపై కూడా కేసు నమోదు కానున్నట్లు సమాచారం.  సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఆందోళన చేసిన 150 మందిపై ఇప్పటికే కేసు నమోదైంది. 
 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ నేత క్రిషాంక్ విచారణ Publish Date: Apr 9, 2025 12:43PM

మరోసారి రచ్చకెక్కిన మంచు వారి ఫ్యామిలీ ఫైట్

మంచు ఫ్యామిలీ వార్ మరో సారి రచ్చకెక్కింది. మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించడంతో ఆ కుటుంబ పంచాయతీ మరోసారి రోడ్డున పడింది. తన తండ్రితో  మాట్లాడలంటూ మంచు మనోజ్ జల్‌పల్లిలో   మోహన్‌ బాబు ఇంటి వద్ద బైఠాయించడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది.  బుధవారం(ఏప్రిల్ 9) ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు వద్దకు మంచు మనోజ్ చేరుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇంటి గేటు తెరవకపోవడంతో మనోజ్ ఇంటి ముందే బైఠాయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.  అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.  అంతకు ముందు మంగళవారం (ఏప్రిల్ 8) మంచు మనోజ్ తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కారును సోదరుడు మంచు విష్ణుయే తీసుకువెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ బుధవారం (ఏప్రిల్ 9) మంచు మోహన్ బాబు నివాసానికి వచ్చారు. అయితే లోపలకు అనుమతించకపోవడంతో ఇంటి ముందే బైఠాయించారు. 
మరోసారి రచ్చకెక్కిన మంచు వారి ఫ్యామిలీ ఫైట్ Publish Date: Apr 9, 2025 12:09PM

పుచ్చకాయను ఇలా తింటే.. పాయిజన్ అవుతుందట..!

పుచ్చకాయ వేసవిలో చాలామందికి ఇష్టమైన పండు. ఇందులో అధికశాతం నీరు ఉండటంతో పుచ్చకాయ తింటే వేసవి వేడిని అధిగమించవచ్చు.  అయితే పుచ్చకాయను తినడంలో చాలా మంది పొరపాటు చేస్తారు.  ఇలా పొరపాటుగా తినడం వల్ల పుచ్చకాయ శరీరానికి మంచి చేయకపోగా చెడు చేస్తుంది  అంటున్నారు ఆహార నిపుణులు.  పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు ఏంటి? పుచ్చకాయను ఎలా తింటే మంచిది? ఎలా తినకూడదు? పూర్తీగా తెలుసుకుంటే.. ఖాళీ కడుపు.. పుచ్చకాయలో అధిక మొత్తంలో సహజ చక్కెర,  నీరు ఉంటాయి. ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో గ్యాస్, ఆమ్లతత్వం,  జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందుగా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి.  ఆ తరువాతే పుచ్చకాయ తినాలని ఆహార నిపుణులు అంటున్నారు. భోజనం తరువాత.. చాలా మంది భోజనం తర్వాత పండ్లు  తింటూ ఉంటారు.   వేసవిలో తియ్యగా, చల్లగా ఉండే  పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే   కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. భోజనం చేసిన కనీసం ఒక గంట తర్వాత పుచ్చకాయ  తినడం మంచిది. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే.. చల్లటి పుచ్చకాయ రుచిగా ఉంటుంది. కానీ వెంటనే తినడం వల్ల గొంతు నొప్పి,  జలుబు వస్తుంది. మొదట గది ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం ఉంచి ఆ తర్వాత తినాలి. ఇది కాకుండా, ఎల్లప్పుడూ తక్కువ పరిమాణంలో పుచ్చకాయ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినకూడదు. శరీరం దానిని సరిగ్గా జీర్ణం చేసుకునేలా చిన్న భాగాలలో తినాలి. ఉప్పుతో.. చాలా మంది పుచ్చకాయలో ఉప్పు వేసి తినడానికి ఇష్టపడతారు.  ఎందుకంటే ఇలా తింటే  మరింత తీపిగా,  జ్యుసిగా ఉంటుంది. కానీ అది ఆరోగ్యానికి హానికరం అని చాలా మందికి తెలియదు.  ఇది  శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతుంది. అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా  ఇప్పటికే అధిక రక్తపోటు సమస్య ఉంటే పుచ్చకాయతో ఉప్పు తినడం పూర్తిగా మానేయాలి. ఎలా తినాలి.. ఎల్లప్పుడూ తాజాగా ఉన్న పుచ్చకాయను, ఇంట్లో నిల్వ చేయకుండా అప్పటికప్పుడు కట్ చేసుకున్న పుచ్చకాయను తినాలి.  చెడిపోయిన పుచ్చకాయ తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది, దీనిని ఎక్కువగా తినడం వల్ల తరచుగా మూత్రవిసర్జన,  కడుపులో భారంగా అనిపించవచ్చు. ఎల్లప్పుడూ పుచ్చకాయను ఒకదాన్నే తినాలి.   ఇతర పండ్లతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పుచ్చకాయను ఇలా తింటే.. పాయిజన్ అవుతుందట..! Publish Date: Apr 9, 2025 12:09PM

వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించడం వరుసగా ఇది రెండవ సారి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం (ఏప్రిల్ 9) ఉదయం ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో ఇప్పుడున్న  6.25 నుంచి 6 శాతానికి రెపో తగ్గింది. ఈ తగ్గింపుతో హోమ్‌, వెహిక‌ల్‌, ప‌ర్స‌న‌ల్ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌నున్నాయి. గత ఫిబ్రవరిలోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.  దేశీయంగా ద్ర‌వ్యోల్బ‌ణం నియంత్ర‌ణలోనే  ఉండటం, ముఖ్యంగా  ఆహార ప‌దార్థాల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో   ఆర్థిక వృద్ధికి దోహదపడేలా వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.  ఇక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన  సుంకాల ప్ర‌భావం నేపథ్యంలో   దేశీయంగా వినియోగం, పెట్టుబ‌డుల సామర్థ్యం మందగించకుండా ఉండేందుకు కూడా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.  
వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ Publish Date: Apr 9, 2025 11:47AM

కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్.. రెండ్రోజులపాటు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం  క్రమంగా బలహీనపడుతోందని విపత్తు నిర్వహణా సంస్థ  తెలిపింది.  నైరుతి పశ్చిమ బంగాళా ఖాతంలో బలపడిన అల్పపీడనం అదే దిశగా కొనసాగుతూ క్రమంగా బలహీనడనుంది.   దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో  ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి.  బుధ, గురువారాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన  వర్షం కురుస్తుందని విపత్తు నిర్వహణా సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు చెట్ల క్రింద ఉండరాదని ఆయన హెచ్చరించారు. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారి అయ్యింది శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణలో క్రమంగా ఊష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నాలుగు డిగ్రీల ఊష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. 
కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్.. రెండ్రోజులపాటు వర్షాలు Publish Date: Apr 9, 2025 11:26AM

ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో ఉండే  బీజేపీ నాయకుడు, గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై  వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళ్ హట్​ పోలీస్ స్టేషన్​లో  రాజాసింగ్  తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఇదే మంగళ్ హాట్ పీఎస్ లో  ఆదివానం ( ఏప్రిల్ 6)న కేసు నమోదైన సంగతి తెలిసిందే. ముందుగా ఆదివారం నాడు రాజాసింగ్ పై శోభాయాత్ర సందర్భంగా పోలీసు ఆదేశాలను ధిక్కరించి డీజే ఏర్పాటు చేయడంతో రాజాసింగ్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రాజాసింగ్ తో పాటుగా  శ్రీరామనవమి పల్లకి సేవా శోభాయాత్ర నిర్వాహకుడు ఆనంద్​సింగ్ లోథ్,  భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భవంత్​రావులపై  బీఎన్ఎస్ సెక్షన్లు 223, 292 కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) అదే శోభాయాత్రలో అనుచిత భాష ప్రయోగించారంటూ మరో కేసు నమోదైంది. శోభాయాత్ర సందర్భంగా ధూల్ పేట జాలి హనుమాన్ దేవాలయం వద్ద పోలీసులు, శోభాయాత్రలో పాల్గొన్న వారి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు  చేశారంటూ రాజాసింగ్ పై పోలీసలుు  కేసు నమోదు చేశారు.   
ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు Publish Date: Apr 9, 2025 10:58AM

విడదల రజినికి జెయిలా? బెయిలా?

కోర్టు నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ సైబరాబాద్ మొక్క, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజిని  అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.   అక్రమ వసూళ్ల కోసం,తన పై  బెదిరింపులకు పాల్పడ్డారని  స్టోన్ క్రషర్  యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో, విడుదల రజిని ని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ప్రచారమే కాదు స్వయంగా రజనీ కూడా తనను అరెస్టు చేస్తారన్న ఆందోళనలో ఉన్నారు. దీంతో ఆమె  హైకోర్టులో  ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ విచారించిన హైకోర్టు  తీర్పు  రిజర్వ్  చేసింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడదల రజినికి ముందస్తు బెయిలు లభిస్తుందా? లేదా అన్న ఆసక్తి నెలకొంది.   క్రషర్ వ్యాపారిని బెదిరించిన కేసులో విడుదల రజిని భవితవ్యం ఏంటి ? ఈ కేసులో కోర్టు మాజీ మంత్రి విడదల రజనీకి  ముందస్తు బెయిల్ ఇస్తుందా, తిరస్కరిస్తుందా? అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో  యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రజిని  ఈ వివాదంతో తనకే మాత్రం సంబంధం లేదనీ,   రాజకీయ కుట్ర తొనే తనపై ఆరోపణలు చేశారనీ, ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.  అయితే 2019 - 24 మధ్య కాలంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజని అనుచరులపై ,ఆమె వ్యక్తిగత సిబ్బంది పై , అనేక ఆరోపణలు  వచ్చాయి. వాటిపై అప్పట్లోనే కొన్ని కేసులు నమోదవగా మరికొన్ని ఫిర్యాదుల వరకూ వెళ్లాయి. ప్రస్తుతం ఆ ఫిర్యాదులన్నీ కేసులుగా మారతాయన్న  ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  స్టోన్ క్రషర్ యజమాని వద్ద రెండు కోట్లు లంచం తీసుకున్నారనీ, దీనికి ఐపీఎస్ అధికారి జాషువా ,  విడదల రజిని వ్యక్తిగత సిబ్బంది  స్టోన్ క్రషర్ యజమానిని బెదిచారనీ ఆరోపణలు ఉన్నాయి.  ఆ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.   ఈ కేసులో  మాజీ మంత్రి విడదల రజినికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ ఏసీబీ తరఫున న్యాయవాదులు హైకోర్టు ముందు గట్టిగా   వాదనలు వినిపించారు.   ఈ నేపథ్యంలో విడుదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత  ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొన్నది.   కేసు ఒక్క ముడుపుల విషయంలోనే అయితే ముందస్తు బెయిలు రావడం కష్టమేమీ కాదనీ, అయితే.. స్టోన్ క్రషర్ యజమానికి చంపేస్తామని బెదరించారని కూడా కేసు ఉండటంతో ముందస్తు బెయిలు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా కేసు రుజువైతే మాజీ మంత్రి విడదల రజినికి పదేళ్ల జైలు విక్ష పడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో రజినికి బెయిలా? అరెస్టా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 
  విడదల రజినికి జెయిలా? బెయిలా? Publish Date: Apr 9, 2025 10:34AM

ఆక్వా రైతులకు చంద్రబాబు అండ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు కుదేలైన ఆక్వా రంగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసాగా నిలిచారు. ట్రంప్ సుంకాల విధింపు  ప్రభావం ఏపీలో మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని అక్వా రైతులపై తీవ్రంగా పడింది. ట్రంప్ సుంకాల కారణంగా  ఏపీ నుంచి విదేశాలకు రొయ్యల ఎగురమతులు భారీగా పడిపోయాయి. ఫలితంగా   ఆక్వా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.  అదే సమయంలో ట్రంప్ సుంకాల దెబ్బతో బెంబేలెత్తిపోయిన రొయ్యల ఎగుమతిదారులు,  రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తున్నా అతి తక్కువ ధరలు మాత్రమే ఇస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిపై సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి చచంద్రబాబు నష్టనివారణ చర్యలకు నడుంబిగించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ కు లేఖ రాశారు. అంతే కాకుండా సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ఆయా శాఖల అదికారులతో నిర్వహించిన ఈ కీలక సమావేశంలో  చంద్రబాబు   దీర్ఘకాలంలో స్థానిక వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని, ఫలితంగా విదేశీ మార్కెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో ఆక్వా రైతులను ఆదుకునే దిశగా వ్యాపారులు, ఎగుమతి దారులు సహకరించాలని కోరారు. అందుకోసం 100 కౌంట్ రోయ్యలను కిలోకు రూ.220కి తగ్గకుండా కొనుగోలు చేయాలని   సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారుల నుంచి సానుకూల స్పందన లభించింది.   అలాగే దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ లకు రొయ్యల ఎగుమతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, మంచి ఫలితాలు కూడా ఉంటాయని అన్నారు.  తాను కూడా కేంద్రంతో చర్చించి, ఆయా దేశాలలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదిరే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.  ఇక ఆక్వా రంగంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆక్వా రైతులు ఆక్వా రంగ నిపుణులు, ఎగుమతిదారులు, ఎంపెడా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుందని ఆయన తెలిపారు.
 ఆక్వా రైతులకు చంద్రబాబు అండ Publish Date: Apr 9, 2025 10:12AM

పరీక్షల సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

  పరీక్షలు.. పిల్లల జీవితాలను మార్చేవి.  ఏడాది మొత్తం చదివిన విషయాలను ఒక పరీక్షతో సమాధానాలు ఇచ్చి ప్రతిభను నిరూపించుకుంటేనే తదుపరి  తరగతికి లేదా తదుపరి దశకు అవకాశం ఉంటుంది.  అయితే పిల్లలు అయినా, పెద్దలు అయినా పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేటప్పుడు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలా ఒత్తిడికి గురైతే చదివిన విషయాలు గుర్తుండవు,  సిలబస్ తొందరగా పూర్తీ చేయలేం. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి. ఒత్తిడి తగ్గడానికి చాలా మంది శ్వాస వ్యాయామాలు చేస్తారు.  లోతైన శ్వాస అనేది ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. కళ్లు మూసుకుని కొన్ని నిమిషాలు ధీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి అనేది దరిచేరదు. ఎప్పుడూ నాన్ స్టాప్ గా చదువుకుంటూ ఉంటారు కొందరు. దీని వల్ల తాము బాగా చదువుతున్నాం అనుకుంటారు. కానీ ఇలా నాన్ స్టాప్ గా చదువుకోవడం వల్ల మనసు  అలసిపోతుంది. అందుకే ప్రతి గంటకు కనీసం 5 నుండి 10 నిమిషాల విరామం తీసుకోవాలి. ఈ 5, 10 నిమిషాల సమయంలో నీరు త్రాగడం, కాస్త ధీర్ఘశ్వాస తీసుకోవడం,  అటు ఇటు నడవడం వంటి పనులు ఏదో ఒకటి చేయవచ్చు. ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే పరీక్షల ఒత్తిడి అనిపించదు. నిద్ర శరీరానికి ఔషధం వంటిది.   నిద్ర సరిగా లేకపోతే శరీరం అలసిపోయినట్టు అనిపిస్తుంది. మెదడు కూడా చురుగ్గా ఉండదు. అందుకే  ఎంత సిలబస్ ఉన్నా, పరీక్షలు ఎలాంటివి అయినా రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడం ముఖ్యం. అది కూడా కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం శరీరాన్నిమాత్రమే ఫిట్ గా ఉంచుతుంది అనుకుంటే పొరపాటు.  వ్యాయామం ఫిట్ గా ఉండటానికే కాకుండా మనసు ఏకాగ్రత పెరగడానికి,  ఒత్తిడి తగ్గడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది.  అందుకే రోజూ కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. ఒక్కొకరికి ఒకో  అభిరుచి ఉంటుంది.  ఈ అభిరుచిని బట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.  కొందరు సంగీతం వింటారు.  కొందరు తోట పని చేస్తారు.  ఇలా నచ్చిన పని కొద్దిసేపు చేయడం వల్ల మనసు ఆందోళన తగ్గుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ  సహకారంగా ఉంటారు.  ఒత్తిడిగా అనిపించిన సందర్భాలలో చదవాలని అనుకోవడం తప్పు.  ఒత్తిడిగా అనిపించినప్పుడు సింపుల్ పుస్తకాలు పక్కన పెట్టి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపాలి.  ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ ఆలోచనలు సగం పైగా ఒత్తిడిని తగ్గిస్తాయి.   ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పరీక్షల కోసం బాగా చదవాలన్నా, పరీక్షలు బాగా రాయాలన్నా పరీక్షల గురించి పాజిటివ్ గా ఉండాలి. అలాగని పరీక్షలను లైట్ గా తీసుకోకూడదు. సీరియస్ గా చదువుతూనే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలం అనే నమ్మకం పెట్టుకోవాలి.                           *రూపశ్రీ.
పరీక్షల సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. ఇలా చేయండి..! Publish Date: Apr 9, 2025 10:04AM

బెంగాల్లో మళ్ళీ ఎర్రజెండా?

ఒకప్పుడు ఎర్ర జెండా అంటే, ముందుగా పశ్చిమ బెంగాల్ గుర్తుకువచ్చేది. ఇంచుమించుగా పాతికేళ్లకు పైగా ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రిగా  ఓ వెలుగు వెలిగిన కామ్రేడ్ జ్యోతి బసు పలచని రూపం కళ్ళ ముందుకు వచ్చేది. నిజానికి, జ్యోతి బసు బెంగాల్ కు మాత్రమే పరిమితం అయిన నాయకుడు కాదు. జాతీయ రాజకీయాల్లోనూ జ్యోతిబసు కీలక భూమిక  పోషించారు. ఒక దశలో,యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రధాని పదవి జ్యోతి బసు తలుపు తట్టింది. అయితే, పార్టీ పెద్దల చారిత్రక తప్పిదం  కారణంగా చేజారి పోయింది. జ్యోతి బసు తర్వాత  ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన బుద్దదేవ్ భట్టాచార్య కొంత కాలం ఆ వారసత్వాన్ని  కొనసాగించారు. అయితే  ఇప్పడు అదంతా చరిత్ర.  ప్రస్తుత పరిస్థితి అది కాదు. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా  ఏకచత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన వామపక్ష కూటమికి  ఈ రోజు బెంగాల్లో ఓట్లే గానీ, సీట్లు లేవు. ఆ ఓట్ల శాతం కూడా దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతోంది. ఉదాహరణకు 2024 లోక్ సభ ఎన్నికలనే తీసుకుంటే, కూటమి పెద్దన్న సిపిఎం సహా వామపక్ష కూటమి పార్టీలలో ఏ ఒక్క పార్టీకి పట్టుమని పది శాతం ఓట్లు దక్కలేదు. సిపిఎంకు కేవలం 5.67 శాతం ఓట్లు పోలయ్యాయి. పెద్దన్న పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ్ముళ్ళ సంగతి చెప్పనక్కర లేదు. చిన్నన్న సిపిఐకి ఒక శాతం కంటే తక్కువ (0.22) శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.   నిజానికి, 2024 ఎన్నికల్లో బెంగాల్ గడ్డపై పట్టు సాధించేందుకు  వామ పక్ష కూటమి  ముఖ్యంగా సిపిఎం చాలా గట్టి ప్రయత్నమే చేసింది. సిపిఎం అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారామ్ ఏచూరి సారథ్యంలో,పార్టీ పునరుజ్జీవనం లక్ష్యంగా గట్టి ప్రయత్నమే జరిగింది. వామపక్ష కూటమి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. అయితే ఆ ఎన్నికల్లో హస్తం పార్టీకి అయినా ఒక సీటు (మాల్దా దక్షిణ్) దక్కింది కానీ, సిపిఎం సహా వామపక్ష కూటమి   పార్టీలకు సింగీల్ సీటు కూడా దక్కలేదు.  నిజానికి  33సీట్లలో పోటీ చేసిన వామపక్ష కూటమికి, ఒక్క సీటు దక్కక  పోవడమే కాదు, ఒక్క సీటు  మినహా, మరెక్కడా రెండవ స్థానం కూడా దక్కలేదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మవలసిన దీన స్థితికి చేరుకుంది. అలాగే చాలా వరకు స్థానాల్లో లెఫ్ట్  డిపాజిట్లు కోల్పోయింది. నిజానికి, ఇప్పటికీ బెంగాల్  రాజకీయాల్లో  రెడ్ ఫ్లాగ్ కు సెల్యూట్ చేసే చేతులు చాలానే ఉన్నాయి. ఆ విధంగా ఎర్ర జెండాకు ఇంకా ఎంతో కొంత గౌరవం వుంది. అయితే  రాష్రంలో తిరుగు లేని శక్తిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ ను సమర్ధవంతంగా ఎందుర్కునే జవసత్వాలను లెఫ్ట్ పార్టీలు చాల వరకు కోల్పోయాయి. అందుకే, లెఫ్ట్  కూటమిని దాటుకుని బీజేపీ ముందుకు దూసుకు వెళ్ళింది. తృణమూల్ కు ప్రధాన ప్రత్యర్ధిగా కమల దళం నిలిచింది. అంతవరకూ  ఒకటి రెండు సీట్లు, మూడు నాలుగు శాతం ఓట్లతో ఎక్కడో ఉన్న బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికలలో, అనూహ్యంగా ప్రభంజనం సృష్టించింది. అంతవరకు కేవలం రెండు స్థానాలు మాత్రమే ఉన్న బీజేపే ఏకంగా 18 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఓటింగ్ శాతం  అయితే, 11 శాతం నుంచి 40 శాతానికి జంప్ చేసింది. ఆ ఎన్నికల్లోనే, వామపక్ష కూటమి  సున్నా సీట్ల, శూన్య స్థాయికి చేరింది. ఆ తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే శూన్య స్థితి కొనసాగింది. మొత్తం 294 స్థనాలలో 215 స్థానాలు గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్ మూడవ సారి అధికారం దక్కించుకుంటే.. 77 స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో  తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక అప్పటి నుంచి లెఫ్ట్ ఖాతాలో అదే సున్నా  కంటిన్యూ అవుతోంది. తృణమూల్, బీజేపే మధ్యనే ప్రధాన పోటీ నడుస్తోంది.  అయితే, రెండు రోజు క్రితం మధురైలో ముగిసిన సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో బెంగాల్ పునరుజ్జీవన ప్రణాళికలపై సిపిఎం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. యువ రక్తంతో పార్టీని ఉరకలు వేయించాలనే లక్ష్యంతో, కేంద్ర కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా పార్టీ యువజన విభాగం డివైఎఫ్ఐ, బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి  మీనాక్షి ముఖర్జీని  84 మంది సభ్యుల కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. నిజానికి  యువ రక్తం నినాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఐదేళ్ళ క్రితమే సీతారాం ఏచూరి ఆ ప్రయత్నం చేశారు. అయితే  2021 ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఆ ప్రయత్నం ఫలించలేదనే విషయం స్పష్టమవుతుంది. ఆ ఎన్నికల్లో మీనాక్షి  కూడా పోటీ చేశారు. ఓడి పోయారు.  అయితే.. ఆ ఎన్నికల్లో ఆమె ఇద్దరు దిగ్గజ నేతలను ఎదుర్కుని ఓడిపోయిన ప్రముఖుల జాబితాలో ప్రముఖ స్థానం సంపాదించు కున్నారు. అవును తెలంగాణలో  కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలో (అప్పటి)  ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నఅభ్యర్ధి, పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి ని, బీజేపీ అభ్యర్ధి కేవీఆర్ రెడ్డి ఢీ  కొన్న విధంగా. మీనాక్షి, పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్  నియోజకవర్గంలో ముఖ్యమత్రి మమత బెనర్జీ, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి సువేందు అధికారిని, ఢీ  కొన్నారు.అయితే, ఇక్కడ కామారెడ్డిలో లో కేవీఆర్ దిగ్గజ నేతలు ఇద్దరినీ ఓడించి గెలిచారు. అక్కడ ఆమె ఓడిపోయారు.ఆమెకు కేవలం 2.74 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.గెలుపు ఓటములను పక్కనపెడితే, మదురై సభల్లో మార్క్సిస్టులు బెంగాల్లో మరో మారు ఎర్ర జెండాను ఎగరేయాలానే సంకల్పం అయితే గట్టిగా చెప్పుకున్నారు. అయినా మన  బాలయ్య బాబు అన్నట్లు,అన్నీ అను కున్నట్లు జరుగుతాయా ఏంటి ?
బెంగాల్లో మళ్ళీ ఎర్రజెండా? Publish Date: Apr 9, 2025 9:52AM

ఫిర్ ఏక్ బార్., కేసీఆర్ సర్ కార్?

తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారి పోతున్నాయి.  ప్రభుత్వ వ్యతిరేకత పరుగులు తీస్తోంది, ప్రభుత్వ ప్రతిష్ట అంతే వేగంగా దిగజారుతోంది. సర్కార్ గ్రాఫ్ పడిపోతోంది,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయట సమస్యలు ఎదుర్కుంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రెక్కలు కత్తిరించింది చేతులు కట్టేసింది. కాళ్ళకు సంకెళ్ళు, నోటికి తాళం  వేసింది. సెక్రటేరియట్ గాంధీ భవన్ కు మారింది, గాంధీ భవన్ నుంచి  రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి నటరాజన్ సమాంతర సర్కార్ నడుపుతున్నారు. మీట నొక్కితే చాలు ఇలాంటి వార్తలు తెర మీద వాలిపోతున్నాయి.  నిజమే కాంగ్రస్ పార్టీని  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలకు ఆధారాలు ఏమిటీ అంటే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అయితే  రోజులు గడిచే కొద్దీ  వార్తల వేడి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు పొలిటికల్, సోషల్ మీడియా సర్కిల్స్ కు పరిమితమయిన  విశేష వార్తలు,  ఇప్పడు సామాన్యుడి  సంభాషణలోకి వచ్చేసాయి. మార్నింగ్ వాక్ లో  టీ దుకాణాలు, టిఫిన్ బండ్లు, కాఫీ షాపుల్లో, బస్సుల్లో, బస్ స్టాపుల్లో, మార్కెట్ ప్లేసుల్లో, చివరకు గుళ్ళూ గోపురాలో కూడా ఇప్పడు ఇవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అదేమంటే, రాజ్యాంగం, ఆర్టికల్ 19, వాక్ స్వాతంత్రం... అన్నీ వచ్చేస్తాయి.  సో .. ఇలాంటి ఈ వార్తల్లో నిజం ఎంత వుందో  చెప్పడం కుదరదు. కానీ, కొంతైతే నిజం ఉందని మాత్రం గంటాపథంగా చెప్పవచ్చని,అంటున్నారు. అవును అసలు నిప్పు లేనిదే పొగ  పొగ రాదు  కదా  అనుకోవచ్చును. అయితే, ఇదుగో తోక అంటే, అదిగో పులి అంటూ కథలు అల్లే నేర్పరులు కాంగ్రెస్ ప్రభుత్వం కథ ముగిసినట్లేనా? కథ ముగిసిందా? అంటూ కథలు వండేస్తున్నారు, వడ్డిస్తున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  మౌనం వదిలి బయటకు వస్తున్న నేపథ్యంలో.. ఈ నెల ( ఏప్రిల్) 27 న వరంగల్ లో జరప తలపెట్టిన, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సిల్వర్ జూబ్లీ వేడుకల వేదిక నుంచి గులాబీ బాస్  పోరాట శంఖం పూరిస్తారనీ,ఇక అక్కడి నుంచి రాజకీయం మారిపోతుందనే వ్యూహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే  ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మనుగడ కూడా కష్టమే అని కొందరు  పండితులు  జోస్యం చెపుతున్నారు.  అయితే  నిజంగానే పరిస్థితి అంత విషమంగా ఉందా  అంటే.. ముప్పు పొంచి  ఉన్నట్లు కనిపించినా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు లేదు. మహా  అయితే, పడిపోతున్న గ్రాఫ్ ను నిలబెట్టుకునేందుకు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారిస్తే మార్చవచ్చును. నిజానికి అ స్కోప్ కూడా పెద్దగా లేదనే అంటున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఆదిస్థానం ఇప్పడు రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. హస్తం పార్టీ చేతిలో ఉన్నదే మూడు రాష్ట్రాలు, అందులో ఒకటి పోతే మిగిలేది, రెండు. నిజానికి  ఆ రెండు రాష్టాల్లోనూ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. అక్కడా, ఇక్కడని కాదు,దేశంలో ఎక్కడా హస్త రేఖలు సంక్రమంగా లేవు. అష్ట/షష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్  ప్రభావమో ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కుంటోంది.  సో.. రేవంత్ రెడ్డిని తొలిగించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం  చేయక పోవచ్చును అంటున్నారు. మరో వంక బీజేపీ కూడా ఇప్పటి కిప్పుడు ఎన్నికలు కోరుకోవడం లేదు. కాబట్టి, రేవంత్ రెడ్డి సర్కార్  కు వచ్చిన ముప్పు లేదని అంటున్నారు. అయితే, ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చను పక్కన పెడితే.. ఓ వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరో వంక కాంగ్రెస్ అధిష్టానం వరసగా వేస్తున్న తప్పటడుగుల పుణ్యాన రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అలాగే  ప్రధాన పార్టీల సర్వేలు కూడా అదే సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. బీఆర్ఎస్ ఖాయంగా అధికారంలోకి వస్తుందని  కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారు. బహిరంగంగా చెప్పక పోవచ్చును కానీ, వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం కాంగ్రెస్ నాయకులు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. ఫిర్ ఏక్ బార్. కేసీఆర్ సర్’కార్’ అంటున్నారు.  బీఆర్ఎస్ పడి లేచిన కెరటంలా మళ్ళీ మరో మారు అధికారంలోకి వస్తుందనే విశ్వాసం  కారు పార్టీలో  వ్యక్తమవుతోంది.
ఫిర్ ఏక్ బార్.,  కేసీఆర్ సర్ కార్? Publish Date: Apr 9, 2025 7:10AM

సింగపూర్ బయలు దేరిన పవన్, చిరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.   చిన్న కొడుకు మార్క్ శంకర్ తాను చదువుతున్నపాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లే ముందు ఈ విషయంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజునాడే చిన్న కుమారుడు ప్రమాదానికి గురయ్యాడని గద్దద స్వరంతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రస్తుతం తన చిన్న కుమారుడు క్షేమంగానే ఉన్నాడనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ పవన్ కల్యాణ్ చెప్పారు.  ఈ ప్రమాదంలో చాలా మంది పిల్లలు గాయపడ్డారన్న పవన్ వారిలో తన కుమారుడు కూడా ఒకరని చెప్పారు.    తన కుమారుడు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తనకు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, మంత్రి నారా లోకేష్ తదితరులందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.   ఇలా ఉండగా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డాడన్న విషయం తెలిసిన వెంటనే పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.  
సింగపూర్ బయలు దేరిన పవన్, చిరు Publish Date: Apr 8, 2025 11:07PM

వలంటీర్లను వంచించింది జగనే.. తేల్చి చెప్పిన పవన్

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ జగన్ కోసం జగన్ చేత జగనే సృష్టించుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థను జగన్ గాలి కొదిలేశారు. తన కోసం పని చేయడం తప్ప వలంటీర్లకు ఉద్యోగ భద్రత అన్నది లేకుండా చేశారు.   వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో సంక్షేమ పథకాల అమలులో జగన్ హయాంలో కీలక భూమిక పోషించింది. చెప్పాలి.  ఈ కారణంగా తాము అధికారంలోకి వచ్చినా కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని   ఎన్నికలకు ముందు  తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అంతే కాకుండా   వలంటీర్లకు అప్పటి వరకూ ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని పది వేలు చేస్తానని కూడా వాగ్దానం చేశారు. ఇదీ వాస్తవమే. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశంతో చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేశారు. అధాకారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి క్యాబినెట్ లోనే వలంటీర్ల వ్యవస్థపై చర్చించారు. ఇదే విషయాన్ని అడవి తల్లి బాటలో భాగంగా సోమ, మంగళవారాల్లో (ఏప్రిల్ 7, 8) తేదీల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఏ కరంగానూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేని పరిస్థితిని జగన్ సృష్టించారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.  వలంటీర్లను వంచించింది, ఆ వ్యవస్థ మనుగడ లేకుండా చేసిందీ జగన్ సర్కారేనని కుండబద్దలు కొట్టారు.   వలంటీర్లను నియమించుకున్న వైసీపీ ప్రభుత్వం వారితో పనిచేయించుకుందే గానీ, వారి భవిష్యత్తు గురించి, ఉద్యోగ భద్రత గురించి పట్టించుకోలేదన్నారు. వలంటీర్ వ్యవస్థకు జగన్ సర్కార్ అధికారిక ముద్ర వేయలేదన్నారు.   ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ వద్ద కూడా వలంటీర్ వ్యవస్థ గురించి ఒక్కటంటే ఒక్క పత్రం కూడా లేదన్నారు. అసలు వలంటీర్లకు వేతనాలను కూడా వైసీపీ సర్కారు ప్రభుత్వం ద్వారా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. వలంటీర్లకు ఏ విధంగానూ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ చేసిందన్నారు.అసలు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా జగన్ సర్కార్ జీవో కూడా జారీ చేయలేదనీ, అయినా కూడా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులేనన్న భ్రమల్లో వారిని ఉంచిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వలంటీర్లను ప్రభుత్వం వంచించిందనీ, ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను కొనసాగిద్దామన్నా కొనసాగించలేని పరిస్థతి ఉందనీ చెప్పారు.  
వలంటీర్లను వంచించింది జగనే.. తేల్చి చెప్పిన పవన్ Publish Date: Apr 8, 2025 10:35PM

బ్రహ్మకుమారీ చీఫ్ దాదీ రతన్ మోహిని కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీల చీఫ్​ దాది రతన్ మోహిని ఇక లేరు. ఆమె వయస్సు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆమె పరమపదించిన విషయాన్ని బ్రహ్మకుమారీ సంస్థ పీఆర్వో ధృవీకరించారు.    గత నెల 25న వందవ పుట్టిన రోజు జరుపుకున్న రతన్ మోహిని గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజస్థాన్లోని ట్రామా సెంటర్ కు తరలించారు. అయితే సోమవారం నాటికి ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో అహ్మదాబాద్ లోని జైడన్ ఆస్పత్రిలో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె పార్ధివదేహాన్ని రాజస్థాన్ లోని బ్రహ్మకుమారీస్   ప్రధాన కార్యాల‌యానికి తీసుకువెళ్లారు.      సింధ్‌లోని హైద‌రాబాద్‌లో జన్మించిన  దాది ర‌త‌న్ మోహిని అసలు పేరు పేరు ల‌క్ష్మీ. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారిస్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌లో బ్రహ్మకుమారీల తరపున పాల్గొన్నారు.  
బ్రహ్మకుమారీ చీఫ్ దాదీ రతన్ మోహిని కన్నుమూత Publish Date: Apr 8, 2025 9:54PM

మావోయిస్టు పార్టీ బెదిరింపు లేఖ 

చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లతో  మావోయిస్టులకు  కోలుకోలేని దెబ్బ తగిలింది.  నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాజాగా  మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను ఇన్ ఫార్మర్లుగా చేసుకుని ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం జల్లెడపడుతుంది. 2026 మార్చి వరకు మావోయిస్టు రహిత దేశం చేస్తామని కేంద్రం ప్రకటించింది.   మావోయిస్టులు  ఇటీవల ఎన్ కౌంటర్లతో భారీ మూల్యం చెల్లించుకోవడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కర్రెగుట్టపై రావొద్దంటూ  బాంబులు అమర్చినట్టు చెప్పారు. అమాయక ఆదివాసులు ప్రాణాలు కోల్పోకూడదని నక్సలైట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని నక్సలైట్లు ఆరోపించారు. ఆదివాసులకు మాయమాటలు చెప్పి ప్రలోభపెడుతున్న పోలీసులను నమ్మొద్దని నక్సలైట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వెంకటాపురం వాజేడు కమిటీ  పేరిట  లేఖ విడుదలైంది. 
మావోయిస్టు పార్టీ బెదిరింపు లేఖ  Publish Date: Apr 8, 2025 6:50PM

అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకు స్థాపన 

ఎపి రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత ఇల్లు శంఖు స్థాపన కార్యక్రమం  బుధవారం (ఏప్రిల్ 9) జరుగనుంది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వెలగపూడి సచివాలయం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నిర్మించుకోవడంతో  పలువురు హర్షం వెలిబుచ్చారు. అమరావతిలో చంద్రబాబు నివాసం చేసుకోవడంతో ఈ ప్రాంత అభివృద్ది పనులు వేగవంతమయ్యే అవకాశముందని వారు భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిపై దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు తన స్వంతింటిని పూర్తిగా నిర్లక్యం చేశారు. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి నుంచే పాలన సాగిస్తున్న చంద్రబాబు దేశంలోనే పేరొందిన రాజధాని నిర్మించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. నిలిచి పోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నారు. అమరావతిని రాజధాని చేయకుండా గత ప్రభుత్వం చేసిన కుట్రలను చంద్రబాబు  ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. చంద్రబాబు నూతన ఇల్లుతో అమరావతికి కొత్త శోభ వస్తుందనడంలో సందేహం లేదు. 
అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకు స్థాపన  Publish Date: Apr 8, 2025 6:13PM