కాశ్మీర్లో విరిగిన కొండచరియలు.. 17 మంది..
posted on Mar 30, 2015 4:34PM
గత ఏడాది ఇదే సమయంలో వరద కారణంగా ఎంతో నష్టపోయిన జమ్ము కాశ్మీర్‌ని మరోసారి వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు తోడు జీలమ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తూండటంతో కాశ్మీర్ వణికిపోతోంది. ఈ రాష్ట్రంలోని లాడెన్ గ్రామంలో సోమవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 17 మంది మరణించారు. రాష్ట్రంలో పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతూనే వున్నాయి. అనేక మార్గాలు మూసుకుపోయాయి. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శ్రీనగర్ దగ్గర ప్రమాద స్థాయిని మించి జీలం నది ప్రవహిస్తూండటంతో తీర ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేయించారు. శ్రీనగర్‌లోని జేవీఎంసీ ఆస్పత్రిలో వరదనీరు చేరడంతో రోగులను అక్కడి నుంచి తరలించారు. బుడ్గాం జిల్లాలోని ఓ ప్రాంతంలో రెండు ఇళ్ళు నీట మునిగి 16 మంది వరదలో చిక్కుకున్నారు. జమ్ము కాశ్మీర్ వరదల పరిస్థితిని ప్రధాని నరేంద్రమోడీ సమీక్షించారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని శ్రీనగర్ వెళ్ళి వరద పరిస్థితిని సమీక్షించాలని ప్రధాని ఆదేశించారు.