మంత్రి పదవిపై హరీష్ రియాక్షన్.. ఇకపై ఇలాంటివి సహించను

 

రాజ్‌భవన్‌లో తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, ఈటెల రాజేందర్, నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అయితే మంత్రివర్గ తొలి జాబితాలో ఎమ్మెల్యే హరీష్ రావు పేరు లేకపోవడంపై మీడియాలో భిన్న కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. హరీష్‌కు కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఈ వార్తలపై హరీష్ రావు స్పందించారు. కేసీఆర్ ఎంతో శ్రమించి టీఆర్ఎస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌కు కొత్త మంత్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడే కాకుండా ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగిందని, టీఆర్‌ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడి లాంటి కార్యకర్తనని హరీష్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కేబినెట్ కూర్పు చేశారన్నారు. కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా కూడా నిర్వర్తిస్తానని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇకపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తే సహించనని హరీష్ రావు స్పష్టం చేశారు.