అంతంత మాటలు ఎందుకు హరీష్ రావు గారూ...

 

 తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో వ్యక్తం చేసిన ఆవేదన చూసిన వాళ్ళకి చాలా బాధ కలగడం ఖాయం. ఇంతకూ అయన ఆవేదనకి కారణం ఏమిటంటే, హరీష్ రావు తెరాస పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారని, ఒక ప్రముఖ పార్టీలో అయన జాయిన్ అవడానికి రంగం సిద్ధం అయిందని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అలాగే సీఎం కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలకి వెళ్తారని, అందువల్ల హరీష్ రావు హర్ట్ అయి తెరాస పార్టీని విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.

 

ఇలాంటి వార్తలు తనని ఎంతో బాధకి గురి చేస్తున్నాయని హరీష్ రావు వాపోయారు. తాను కెసిఆర్ ఆజ్ఞని పాటించే వ్యక్తిని అని అంటున్నారు. తనమీద జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరించలేక పోతున్నా అని అయన అన్నారు. తన మీద ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి మీద పోలీస్ ఉన్నతాధికారులకు ఆల్రెడీ ఫిర్యాదు చేసానని అన్నారు. తాను తన కంఠంలో ప్రాణం వున్నంత వరకు తెరాసలోనే ఉంటానని, ప్రాణం పోయినా పార్టీ  మారను అని చెప్పారు.

 

అయినా హరీష్ ఇంతలా ఎందుకు హర్ట్ అవుతున్నారో అర్థం కాని విషయం. ప్రాణం పోయినా పార్టీ మారను అని పెద్ద పెద్ద మాటలు ఎందుకో. రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది మామూలు విషయం. అదేదో నేరం, ఘోరం కాదు. ఇప్పుడు తెరాసలో వున్న వాళ్లు పార్టీలు మారిన వాళ్లే కదా. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే తెరాస విజయవంతంగా నడుస్తోంది కదా. ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి రావడం మంచి విషయం... మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం మాత్రం చెడ్డ విషయం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  సోషల్ మీడియాలో వచ్చే వాటి గురించి ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నారు, దీని వెనుక వేరే కారణాలు ఏవైనా వున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.