అల్లర్లు చేయమని 1.25 కోట్లు

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబా దోషిగా తేలడం.. దీనిని తట్టుకోలేక డేరా మద్ధతుదారులు పంచకుల సహా హర్యానా, రాజస్థాన్‌లలో రావణ కాష్టాన్ని రగిలించారు. ముఖ్యంగా పంచకులలో జరిగిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆ అల్లర్లన్నీ డేరా బాబాను జైలుకు వెళ్లకుండా తప్పించేందుకే చేశారని పోలీసులు నిర్థారించారు. ముఖ్యంగా డేరా దత్తపుత్రిక హానీప్రీత్ సింగ్ తన తండ్రిని బయటకు తెచ్చేందుకు కుట్రలు చేశారని ఆమెపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హానీప్రీత్ దేశం విడిచి పారిపోయారు.

 

దీంతో ఆమెను వెతికేందుకు పోలీసులు, బీఎస్ఎఫ్, నిఘా వర్గాలు ఇండో- నేపాల్ బోర్డర్‌ను జల్లెడ పట్టారు. తాజాగా గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ అయిన రాకేశ్ కుమార్‌‌ను విచారించిన పోలీసులకు మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. గుర్మీత్ దోషిగా తేలిన తర్వాత పంచకుల తదితర ప్రాంతాల్లో అల్లర్లు రేకెత్తించేందుకు డేరా పంచకుల బ్రాండ్ హెడ్‌ చామ్‌కౌర్‌ సింగ్‌కు హనీప్రీత్ సింగ్ రూ.1.25 కోట్లు ముట్టజెప్పిందట. ఈ మొత్తాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇచ్చిన చామ్‌కౌర్ అల్లర్లు జరపాల్సిందిగా ఆదేశించాడట. ఈ విధంగా జరిగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.