ఓడినా హీరో అయ్యాడు...

 

ఇప్పటివరకూ పప్పు.. రాజకీయాల్లో జీరో అని పిలుకుచునే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా హీరో అయ్యాడు. దీనికి కారణం గుజరాత్ ఎన్నికల్లో రాహుల్.. మోడీకి చుక్కలు చూపించడమే. ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. హిమాచల్ ప్రదేశ్ సంగతేమో కానీ.. గుజరాత్ లో మాత్రం బీజేపీకి గెలుపు అంత ఈజీ కాలేదని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. అంతేకాదు ఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం తారుమారయ్యాయి. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీకి 135 స్థానాల‌కు త‌గ్గ‌వ‌ని.. కాంగ్రెస్‌కు 30 నుంచి 40 సీట్లు మించ‌వ‌ని మ‌రో స‌ర్వ ఇలా పలు సర్వేలు చేశారు. అయితే సర్వేలు చెప్పినట్టు బీజేపీ గెలిచినా... కాంగ్రెస్ మాత్రం గతంలో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను గెలిచి.. అందరికీ షాకిచ్చింది. ప్రధాని మోడీ కంచుకోటలో ఒకదశలో కాంగ్రెస్ జెండా ఎగరనుందేమో అని అనుకున్నారంతా. అయితే చావు తప్పి కన్ను లొట్టబోయింది.

 

ఇదిలా ఉండగా.. ఎప్పుడూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించే మోడీ ఈసారి తానే కంగారుపడ్డారు. రాహుల్ గాంధీ మోడీకి చెమటలు పట్టించారు. అంతేకాదు..ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి మాత్ర వ్యక్తిగతంగా  బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. గతంలో మాదిరి కాకుండా.. తన ప్రసంగాల్లో పదునైన మాటలు, మోడీపై సెటైర్లు వేస్తూ కాస్త మెచ్యూరిటీని చూపించాడు. ఆయనలో మార్పుని ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు.. బీజేపీ పార్టీ నేతలు కూడా గుర్తించారు. ఎన్నికల్లో గెలిచినా.. గెలవకపోయినా ఆయన హీరో అయ్యాడు. పార్టీ నేతలకు ఆయనపై నమ్మకం ఏర్పడింది. గుజరాత్ లో గెలవకపోయినా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ మీద సానుకూల ప్రభావం పడింది. ఎన్నికల్లో విజయం దక్కినా దక్కకపోయినా బీజేపీని ఉరుకులు పరుగులు పెట్టించి.. మోదీ, అమిత్ షా జంటను కలవరపరిచిన రాహుల్ రాజకీయ భవిష్యత్‌కు గుజరాత్ పాఠాలు నేర్పి పునాదులు వేసిందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్న రాహుల్ గాంధీ.. ఇలానే కంటిన్యూ అయితే పార్టీకి కానీ.. ఆయన రాజకీయ భవిష్యత్తుకు కానీ ఎటువంటి డోకా లేనట్టే.