కర్మభూమి ఉత్తరప్రదేశ్ తరువాత జన్మభూమి గుజరాతా?

నీళ్లలో మొసలిని, భూమిపై సింహాన్ని, ఆకాశంలో గ్రద్ధని... ఎవ్వరూ ఓడించలేరు! మరి గుజరాత్ లో బీజేపిని? ఇంచుమించూ అంతే! అసలు గెలవదనుకున్న యూపీలో క్రమంగా పరిస్థితి మెరుగుపరుచుకుంటూ వచ్చిన కమలం అద్బుతం సృష్టించింది! ఏకంగా 300కంటే ఎక్కువ సీట్లు సాధించింది ప్రతిపక్షాలకు షాకిచ్చింది! మరి ఇంత జోష్ లో వున్న కాషాయనాథులకు తమ స్వంత గుజరాత్ లో గెలుపు సమస్యగా మారుతుందంటారా? అస్సలు కాదు! అయినా కూడా గుజరాత్ లో ముందస్తు ఎన్నికలకు వెళదామని ఆలోచిస్తున్నారట మోదీ అండ్ షా!

 

ఇవాళ్ల మోదీ నమోగా ఎదిగి నమస్కారాలు అందుకుంటున్నాడంటే దానికి కారణం గుజరాత్! ఆయన రాజకీయ రథయాత్ర అక్కడే మొదలైంది! ద్వారక నుంచి ఉప్పొంగి వచ్చిన అరేబియా సముద్రంలా ఢిల్లీ దాకా, ఇప్పుడు లక్నో దాకా ఆయన దేశం మొత్తాన్నీ ముంచెత్తాడు! కాని, తాజా పరిస్థితులు గుజరాత్ బీజేపిని ఆందోళనలో నెడుతున్నాయి. అందుకే, దేశమంతా నమో నమో అంటూ స్మరిస్తున్న శుభ తరుణంలోనే గాంధీనగర్ పరీక్షని ఎదుర్కొవాలని అనుకుంటున్నారట!

 

గుజరాత్ లో గత రెండు దశాబ్దాలుగా కమలానికి ఎదురు లేదు. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తానన్న ఆశే వదిలేసింది! కేశుభాయ్ పటేల్, తరువాత నరేంద్ర మోది, ఆ తరువాత ఆనందీ బేన్, ఇక ఇప్పుడు విజయ్ రూపానీ... ఇలా వరుసగా కమలనాథులే సీఎం కూర్చీని అలంకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా, మోదీ వరుస విజయాలతో గుజరాత్ కాంగ్రెస్ ను ఆటలో అరటి పండు చేసేశాడు. ప్రతీ ఎన్నికలప్పుడు సోనియాతో సహా ఎందరు మోహరించి గొంతులు చించుకున్నా మోదీ ముందు మోకరిల్లకుండా తప్పటం లేదు! అయితే, 2014లో నరేంద్రుడు ఢిల్లీ బాట పట్టడంతో గుజరాత్ ఒక్కసారిగా కుదుపుకి గురైంది. అదే ఇప్పుడు అమిత్ షాని అమితంగా ఆందోళన పరుస్తోన్న విషయం!

 

మోదీ ఒడిసి పట్టి పరిపాలించిన కాలంలో ఎక్కడా ఏ సమస్య లేని గుజరాత్ తరువాతి కాలంలో పటేళ్ల చిటపటలకి కేంద్రమైంది. హార్దిక్ పటేల్ ప్రమాదం కాకపోయినా చికాకుగా మారాడు. అలాగే, గుజరాతీ రైతులు కూడా ఇబ్బందుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరో వైపు ఆ రాష్ట్ర దళితులు గో రక్షకుల కారణంగా కొంత భయాందోళనలకు గురవుతున్నారని కూడా అంటున్నారు! ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలే! అదే ఇప్పుడు కమలానికి కంగారుగా వుండటానికి కారణం!

 

యూపీ, ఉత్తరాఖండ్ లలో గెలుపు, గోవా, మణిపూర్లలో అధికారం... అంతా ఉత్సాహంగానే వున్నా... మోదీ లేని లోటుతో బీజేపీ గుండెలో గుబులు రేపుతోంది గుజరాత్. అది మరీ ముదరక ముందే ముందస్తు ఎన్నికలకి వెళదామనే ఆలోచనలో వుందట అక్కడి రాష్ట్ర శాఖ! అప్పుడే అమిత్ షా, మోదీ ఫోటోలతో కరపత్రాలు ప్రత్యక్షమయ్యాట వివిధ ప్రాంతాల్లో. ఎలాగూ ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలకు వెళ్లాల్సి వుంది. కాబట్టి మరో అయిదారు నెలల ముందే బ్యాలెట్ వార్ కి సిద్ధపడితే... యూపీ మేనియా గుజరాత్ లోనూ కలిసి వస్తుందని ఆశిస్తున్నారట!

 

గుజరాత్ లో కాంగ్రెస్ కి తోడుగా ఆప్ కూడా రంగంలోకి దిగి హడావిడి చేస్తుండటంతో బీజేపీకి అక్కడ ఈ సారి ఇద్దర్నీ ఎదుర్కోక తప్పని పరిస్థితి వుంది. అందుకే, ముందస్తు ఎత్తుతో కాంగ్రెస్ , ఆప్ లకు యుద్ధానికి సిద్ధమయయ్యే సమయం లేకుండా చేయాలని కూడా ఒక ఆలోచన! మరి అంతా అనుకున్నట్టే జరిగి గుజరాత్ ముందస్తు నగారా మోగితే.... మరో భీభత్సమైన బ్యాలెట్ యుద్ధానికి రంగం సిద్ధమైనట్టే!