జి.హెచ్.యం.సి. డివిజన్ల పునర్విభజనకు బ్రేక్.. త్వరలో ఎన్నికలు?
posted on Sep 29, 2015 8:13AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) బోర్డు పదవీ కాలం గత డిశంబర్ 3తోనే ముగిసింది. కానీ నగరంలో పెరిగిన జనాభాకి అనుగుణంగా డివిజన్ల పునర్విభజన చేయాలంటూ ఇంతకాలం తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరుపకుండా వాయిదా వేస్తూ 10 నెలలు కాలక్షేపం చేసింది. కానీ ఇప్పుడు డివిజన్ల పునర్విభజన చేసి వాటి సంఖ్యని పెంచడం వలన పరిపాలనాపరమయిన ఇబ్బందులు ఎదురవుతాయని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాయడంతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం జి.హెచ్.యం.సి.లో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు యదాతధంగా కొనసాగుతాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జి.హెచ్.యం.సి. డివిజన్లను 200కి పెంచుతూ తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించింది. కానీ మళ్ళీ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకొంటూ మళ్ళీ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలు ఎదురయిన తరువాత వాటిని ఉపసంహరించుకోవడం తెలంగాణా ప్రభుత్వానికి సర్వ సాధారణమయిపోయింది.
కానీ జి.హెచ్.యం.సి. బోర్డుకి ఎన్నికలు నిర్వహించే విషయంలో మాత్రం అదొక సాకు మాత్రమేనని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆంద్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడిన జి.హెచ్.యం.సి. పరిధిలో తెరాస ఎన్నికలలో గెలవడం చాల కష్టం. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న సమయంలో, ఆ తరువాత తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తెరాస నేతలు తమ మాటలతో చేతలతో హైదరాబాద్ జంట నగరాలలో నివసిస్తున్న ఆంద్ర ప్రజలలో తీవ్ర అభద్రతాభావం కల్పించారు. ఇటీవల ఆంధ్రాకు చెందిన 1200 మంది విద్యుత్ ఉద్యోగులను అకస్మాత్తుగా విధులలో నుండి తప్పించి ఆంధ్రాకు అప్పగించడమే అందుకు ఒక సజీవ ఉదాహరణగా చెప్పుకోవచ్చును.
ఇటువంటి కారణాల వలన హైదరాబాద్ జంట నగరాలలో పోటీ చేసి తెరాస విజయం సాధించడం దాదాపు అసంభవం అని గ్రహించడంతో తెరాస ప్రభుత్వం డివిజనల పునర్విభజన సాకుతో జి.హెచ్.యం.సి. ఎన్నికలను ఇంతవరకు వాయిదా వేసి దాని పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఏరివేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా ప్రతిపక్షాలకు మంచి పట్టు ఉన్న డివిజన్లను కుదించి, తనకు పట్టు ఉన్న డివిజన్ల సంఖ్యను పెచుకోవడం ద్వారా తన విజయావకాశాలను మెరుగు పరుచుకోవాలని చూసింది. కానీ ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేయడంతో డివిజన్ల పునర్విభజనలో భౌగోళిక సరిహద్దులు సక్రమంగా రావట్లేదనే సాకుతో ఆ ప్రయత్నాలను కూడా విరమించుకోక తప్పలేదు.
బహుశః అందుకే ఇక చేసేదేమీలేక ఇప్పుడు డివిజన్ల పునర్విభజన ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి ఉండవచ్చును. తెరాస తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ జి.హెచ్.యం.సి. బోర్డుకి ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నుండి జి.హెచ్.యం.సి.కి అందవలసిన వందల కోట్లు నిధులు వెనక్కి మళ్ళి పోయాయి. ఇంకా ఆలశ్యం చేసినట్లయితే వచ్చే ఏడాది కోసం మంజూరు అయ్యే నిధులు కూడా వెనక్కి మళ్ళిపోవచ్చును. కనుక ఇప్పటికయినా జి.హెచ్.యం.సి.కి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా కోరుకొంటున్నారు.