కేసీఆర్ రెచ్చగొట్టినందునే సభ జరుగుతోందా?

 

తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర విభజన చేస్తూ నిర్ణయం ప్రకటించిన తరువాత, హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడి, వారిలో లేని భయాందోళనలను కలిగించడం వలననే, నేడు ఏపీయన్జీవోలు హైదరాబాదులో సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

 

మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ అసలు కేసీఆర్ కి 2014ఎన్నికల వరకు తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేనందునే ఆవిధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తెలంగాణా ప్రక్రియ జాప్యం జరిగేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ డిల్లీలో కూర్చొని ఏమి చేస్తున్నాడని ఆయన ప్రశించారు. తెలంగాణా ఏర్పాటయితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నాడని ప్రశ్నించారు.

 

వారిరువురూ ఎపీయన్జీవోలను కూడా అంతే తీవ్రంగా విమర్శించారు. హైదరాబాదులో సభను నిర్వహిస్తూ వారు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

 

తెదేపా నేతలిరువురు చెప్పిన మాటలలో వాస్తవం ఉంది. నిజానికి కేసీఆర్ “ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందే. వారికి వేరే ఆప్షన్ ఉండవు” అని చెప్పిన తరువాత నుండే వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. నాటి నుండే ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభాజను వ్యతిరేఖిస్తూ నిరసన దీక్షలు మొదలుపెట్టారు. అది తెలంగాణా ఉద్యోగులకు కోపం కలిగించడం సహజమే గనుక వారు కూడా ఆంధ్ర ఉద్యోగులతో పోటాపోటీగా దీక్షలు మొదలుపెట్టారు. తత్ఫలితంగా నేడు రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణలు నిత్యకృత్యం అయిపోయాయి. నిన్న హైకోర్టులో న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలు వాటికి పరాకాష్టగా నిలిచాయి. ఈ భయాందోళనలే నేడు వారిచే సభ నిర్వహింపజేస్తున్నాయి. తెదేపా నేతలు అదే మాట చెప్పారిప్పుడు.

 

నిజానికి కేసీఆర్ చెప్పినా చెప్పకపోయినా, రాష్ట్ర విభజన తరువాత చట్ట ప్రకారం జరుగవలసిన తంతు అంతా జరిగినప్పుడు, ఉద్యోగులలో బదిలీల మీద ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళిపోయి ఉండేవారు. ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నవారికి బదిలీలపై ఊర్లు మారడం తప్పదని వారికి తెలియకపోదు. కానీ కేసీఆర్ అన్నమాటలతో వారి భవిష్యత్ పట్ల అకస్మాత్తుగా అంతవరకు లేని భయాందోళనలు మొదలయ్యాయి. దానికి తోడూ తెరాసలో అతని కుటుంబ సభ్యులు కూడా వారిలో ఆ భయాందోళనలు మరింత పెరిగే విధంగా మాట్లాడేరు.

 

తెరాస నేతలు ఆంద్ర-తెలంగాణా ఉద్యోగుల మద్య జరుగుతున్న గొడవలలో తలదూర్చుతూ వారి మధ్య విద్వేషాలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. సీమంధ్ర నేతలు కూడా అదేపని చేస్తున్నారంటే వారు తెలంగాణాను వ్యతిరేఖిస్తునందునే ఆపని చేస్తున్నట్లు అర్ధంఅవుతుంది. కానీ తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడుతున్న తెరాస కూడా అదే పనిచేయడం చూస్తే నిజంగానే వారికి తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేదని భావించాలేమో! దీనిని బట్టి తెరాస నేతలెవరికీ కూడా ఎన్నికల వరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పడటం ఇష్టం లేదని తెదేపా నేతలు చేస్తున్నఆరోపణలు నిజమేననిపిస్తోంది.