కాంగ్రెస్ లోనే కొనసాగుతా, కిరణ్ కుమార్ కి ఎసరు పెడతా!

 

మాజీ మంత్రి డీయల్ రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తానూ ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. త్వరలో మొదలవనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాల తరువాత తానూ తన నియోజక వర్గంలో పర్యటించి, పార్టీ కార్యకర్తలకి ప్రజలకీ జరిగిన విషయాలన్నీ వివరిస్తానని అన్నారు. ఆయన శాసనసభ సమావేశాల తరువాత తన పర్యటనకి ముహూర్తం పెట్టుకోవడం గమనిస్తే ఈసారి ఆయన శాసన సభ సాక్షిగానే ముఖ్యమంత్రిపై తీవ్రంగా దాడిచేయబోతున్నారని అర్ధం అవుతోంది.

 

సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలలో లోటుపాట్లను, వాటి అమలులో జరుగుతున్న లోపాలను, ముఖ్యమంత్రి ప్రచారాడంబరత, దానిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించి ఆయన ప్రస్తావించి ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చును. సభలో ఆయన ప్రవర్తించిన తీరును బట్టి ఆయనను పార్టీలో కొనసాగించాల లేక బహిష్కరించాలా అనే విషయంపై ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి రావచ్చును.

 

డీయల్ తానూ పార్టీ నుండి బయటకి వెళ్ళిపోయే ఆలోచన గానీ, ఉంటే ఈ సమావేశాలలో ముఖ్యమంత్రికి నరకం చూపించే అవకాశం ఉంది. పాలక పక్ష సభ్యుడయిన ఆయనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం వలన ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలు అందించినట్లవుతుంది. మరి ఆయనను ముఖ్యమంత్రి ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.