కొడాలి నానికి చెక్ పెట్టే దిశగా టీడీపీ.. ఓటమి తప్పదా?

 

గుడివాడ. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గతంలో ఎన్టీఆర్ ఇక్కడినుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 నుంచి 2009 వరకు ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు గుడివాడలో టీడీపీనే గెలుస్తూ వచ్చింది. అలాంటి కంచుకోట.. గత ఎన్నికల్లో టీడీపీకి దూరమైంది. దానికి కారణం కొడాలి నాని. నందమూరి కుటుంబానికి.. మరీ ముఖ్యంగా హరికృష్ణ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొడాలి నాని.. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తక్కువ సమయంలోనే గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదాల కారణంగా నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటినుంచి టీడీపీ మీద విమర్శల చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడుపడని విషయం. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ వల్ల ఎదిగి ఇప్పుడు టీడీపీని విమర్శించడం ఏంటంటూ టీడీపీ నేతలు నాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం కూడా నాని విషయంలో సీరియస్ గానే ఉంది. ఈసారి గుడివాడలో నానికి ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంటుంది.

గత ఎన్నికల్లో నాని మీద పోటీగా.. టీడీపీ. రావి వెంకటేశ్వర రావుని బరిలోకి దింపింది. అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. గుడివాడలో మాత్రం నాని గాలి వీయడంతో.. రావి 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడంతో నాని గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ గుడివాడ మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈసారి నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తోంది. నాని దూకుడును త‌ట్టుకోగ‌లిగిన నేత కోసం టీడీపీ అన్వేషి స్తోంది. వచ్చే ఎన్నికల్లో నాని మీద పోటీగా రావినే బరిలోకి దింపాలా లేదా మరోనేతను దింపాలా అని ఆలోచనలో పడింది. ఆ ఆలోచనల నుంచే కొత్తపేరు తెరమీదకు వచ్చింది. ఆ పేరే దేవినేని అవినాష్.

కొడాలి నాని ని ఎదుర్కోగ‌లిగిన నేత‌ల వడపోత చేపట్టగా తుది పరిశీలనలో రావి వెంకటేశ్వరరావు, దేనినేని అవినాష్‌ పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు రావికి సానుకూలంగా ఉన్నా ఆయన ఎంత వరకు నానిని ధీటుగా ఎదుర్కొనగలరన్న అంశాన్ని పార్టీ వర్గాలు పరిశీలిస్తు న్నాయి. రావి ఆర్థికంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రిచే వ్య‌క్తి కావ‌టంతో అధిష్టానం అవినాష్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో దేవినేని కుటుంబానికి ఓ ప్ర‌త్య‌క గుర్తింపు ఉంది. అవినాష్ ప్రస్తుతం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన యువనేత కావడం.. అదీగాక దివంగత దేవినేని నెహ్రు తనయుడు కావడం కూడా అవినాష్ కి కలిసొచ్చే అంశం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నానికి ధీటైన అభ్యర్థి అవినాషే అని చంద్రబాబు భావిస్తున్నారట. కొద్ది రోజుల్లోనే ఈ విషయం మీద ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.