మహా రాజకీయంలో.. మోడీ విజయం... ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ
posted on Nov 23, 2019 9:56AM
మహా రాజకీయాల్లో చివరికి అనూహ్యమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫెడ్నవిస్ ప్రమాణస్వీకారం చెయ్యగా.. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. శనివారం ( నవంబర్ 23న ) ఉదయం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వీళ్ళతో ప్రమాణస్వీకారం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రే రాజకీయం పూర్తిగా మారిపోయింది. మిత్రపక్షమైన శివసేనకు భాజపా భారీ షాక్ ఇచ్చినట్లే అని చెప్పుకోవచ్చు.
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ( నవంబర్ 22న ) ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే.. ఇద్దరూ పోటాపోటీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురి చేస్తుంది. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్ భేటీ అయిన సందర్భంలోనే.. భాజపా-ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు తెలుస్తుంది. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీకి.. అమిత్ షాకి.. ఫెడ్నవిస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర భవిష్యత్తు కొరకు కృషి చేస్తూ ముందుకు సాగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.