డిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పనితీరుకు గీటురాయా?
posted on Feb 10, 2015 10:08AM
.jpg)
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత ఇంతవరకు జరిగిన అన్నిరాష్ట్రాల ఎన్నికలలో విజయపధంలో దూసుకుపోతున్న బీజేపీకి మొట్టమొదటిసారిగా డిల్లీలో ఎదురు దెబ్బ తగలబోతోంది. అది మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతం అని కొంత మంది రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. కానీ ఆ వాదన నిజమని భావించలేము. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచినా ఓడినా కూడా అవి మోడీ పరిపాలనపై డిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా గెలవాలనుకోవడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు. అదేవిధంగా ఒకసారి అధికారం చేజార్చుకొన్న అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఎలాగయినా గెలిచి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం కూడా సహజమే. వారి ఆ ప్రయత్నాలలో భాగంగా ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు ఆ రెండు పార్టీలు అనుసరించిన వ్యూహాలు, వేసిన ఎత్తులు పై ఎత్తులకు వచ్చిన అంతిమ ఫలితమే ఇవి, అంతే తప్ప ఈ ఫలితాలు మోడీ పాలనకు గీటురాయని చెప్పడానికి లేదు.
మొదట్లో బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీని ముందుకు తీసుకురావడం చేత ఈ ఎన్నికలు మోడీకి, అరవింద్ కేజ్రీవాల్ కి మధ్య జరుగుతున్న పోరాటంగా తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ఒకవేళ కడదాక ఆయననే ముందు ఉంచుకొని బీజేపీ పోరాడి ఉండి ఉంటే నిజంగానే ఆవిధంగా భావించవచ్చును. కానీ బీజేపీ మధ్యలో తన వ్యూహాన్ని మార్చుకొని ఆయనను వెనక్కు తీసుకొని హటాత్తుగా కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకొని ఆమెను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో పార్టీ కార్యకర్తలలో కొంచెం అయోమయ స్థితి, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న పార్టీ నేతలలో కొంచెం అసంతృప్తి నెలకొంది.
ఆయాచితంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఆమాద్మీ పార్టీ చక్కగా వినియోగించుకొని లాభపడింది. ఇదేపని బీజేపీ ముందే చేసి ఉండి ఉంటే ఆమె వలన తప్పకుండా పార్టీకి ప్రయోజనం దక్కేదేమో? కానీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొంటున్న తరుణంలో బీజేపీ వ్యూహంలో జరిగిన ఈ మార్పు వలన ఊహించని నష్టం జరిగింది. ఆమాద్మీ పార్టీ ఎన్నికలకు ఇంకా ఏడూ నెలల సమయం ఉండగానే అప్పటి నుంచే 12 మందితో కూడిన ఒక ఎన్నికల ప్రచార, సమన్వయ కమిటీని నియమించుకొంది. ఆ తరువాత ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన అభ్యర్ధులను ఎంపిక చేసుకొంది. కమిటీ సభ్యులు స్వయంగా ఆయా నియోజక వర్గాలలో పర్యటించి అక్కడి సమస్యలను గుర్తించి వాటిని తమ మ్యానిఫెస్టోలో జోడించారు. అంతే కాకుండా ఆ సమస్యల గురించి, వాటిని తమ పార్టీ ఏవిధంగా పరిష్కారం చేయబోతోందనే విషయంపైన తమ అభ్యర్ధులకు పూర్తి అవగాహన కల్పించారు. అదే విషయాన్ని వారు తమ ప్రసంగాలలో పదేపదే పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈవిధంగా ఏ నియోజక వర్గానికి సంబందించిన సమస్యలను ఆ నియోజక వర్గంలో ప్రస్తావిస్తూ ఆమాద్మీ పార్టీ డిల్లీలో దాదాపు 60 శాతం పైగా ఉన్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చేరువకాగలిగింది.
అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఈ ప్రత్యేకతను కాంగ్రెస్, బీజేపీలు గతంలోనే గుర్తించినప్పటికీ,అందుకు అనుగుణంగా తమ ప్రచార వ్యూహాలను రచించుకోవడంలో అశ్రద్ధ చూపుతూ షరా మామూలుగానే తమదయినా శైలిలో భారీ సభలు, ర్యాలీలు నిర్వహించుకొని వాపును చూసి బలుపు అనుకోని మురిసిపోతూ కాలక్షేపం చేసాయి. అంటే ఈ ఫలితాలు ఆమాద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరించిన వ్యూహాలకు వచ్చిన అంతిమ ఫలితమే తప్ప ఇందులో మోడీ ప్రభావం, మోడీ ప్రభుత్వ పనితీరుతో ఎటువంటి సంబందమూ లేదని స్పష్టం అవుతోంది.