కాంగ్రెస్సా? బీజేపీనా? తేల్చుకోలేకపోతున్న డీఎస్

 

తెలంగాణ రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో విపక్షాలకు సవాల్ విసురుతుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మేము ముందస్తు ఎన్నికలకు సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసురుతుంది.. దీనికి తగ్గట్టే పార్టీలు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు గురించి లెక్కలు, ఆలోచనలు చేస్తున్నాయి.. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది.. అదే డీఎస్ చూపు ఏ పార్టీ వైపు?.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డీఎస్, రాష్ట్ర విభజన అనంతరం అప్పటి పరిస్థితుల దృష్ట్యా మరియు కుమారుడు భవిష్యత్తు కోసం, తెరాసలో చేరారు.. 

తెరాస కూడా డీఎస్ అనుభవానికి గౌరవమిచ్చి రాజ్యసభ సభ్యుడుగా, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.. అయితే డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్, డీఎస్ తో పాటే ఉన్నారు కానీ, రెండో కుమారుడు అరవింద్ మాత్రం బీజేపీ లో చేరారు.. అరవింద్ చేరిక వెనక డీఎస్ ప్లాన్ ఉందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.. ఇలాంటి ఆరోపణలని పెద్దగా పట్టించుకోని డీఎస్.. గత కొంత కాలంగా తెరాసతో మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.. తెరాస పార్టీ కార్యక్రమాల్లో డీఎస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అలానే కుమురుడు సంజయ్, తనతో పాటు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.. 

దీనికి తోడు తాజాగా నిజామాబాద్ తెరాస నేతలు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకి లేఖ రాయడంతో.. డీఎస్ కలత చెంది తెరాసను వీడి వేరే పార్టీలో చేరాలని చూస్తున్నారట.. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు కూడా జరిపారట.. కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించి డీఎస్ కి, ఆయన కుమారుడు సంజయ్ కి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందట.. డీఎస్ అంత ఓకే ఇక పాత గూటికే నా పయనం అని సిద్దమవగా, రెండో కుమారుడు అరవింద్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట.. బీజేపీలో చేరాలని డీఎస్ మీద ఒత్తిడి చేస్తున్నాడట.. 

అలానే బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడిస్తున్నాడట.. కానీ డీఎస్ మాత్రం కాంగ్రెస్ వైపే వెళ్లాలని ఎక్కువ మొగ్గు చూపుతున్నారట.. ఒకప్పటి పార్టీ అయితేనే సంతృప్తి ఉంటుందని భావిస్తున్నారట.. చూద్దాం మరి డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారో లేక రెండో కొడుకు మాటలకు మనస్సు మార్చుకొని బీజేపీలో చేరతారో.. చూద్దాం ఏం జరుగుతుందో.