సీతాఫలాల సీజన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమ్మకాలు భేష్

 

 

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీతాఫలాల వ్యాపారం బాగా జరుగుతుంది. హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర సీతాఫలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా ఎత్తయిన గుట్టలు ఎడారి ప్రాంతాలలో సహజసిద్ధంగా పండే సీతాఫలం చెట్లు చల్లని వాతావరణంలో పూతకు కోతకు వస్తాయి. అంటే చలికాలంలోనే ఏటా ఈ సీతాఫలాలు ఎక్కువ శాతం కాస్తుంటాయి. సీతాఫలం సహజసిద్ధంగా ఎలాంటి పురుగు మందులు వాడకుండానే కాస్తాయి. అందుకే సీతాఫలాలు తినేందుకు అంత ఆసక్తి చూపుతారు. ధర ఎంతైనా కొనుగోళ్లు చేస్తారు.

ఇష్టంగా సీతాఫలాలు తింటారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, చిలుపూరు, చిన్నపెండ్యాల, దేవరుప్పల, దేవునూరు, హసన్ పర్తి మండలం, చింతగట్టు వంటి ఎత్తయిన అటవీ ప్రాంతాలలో సీతాఫలాల చెట్లు పెరుగుతాయి. స్థానిక రైతులు, కూలీలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వారి ఉపాధి కోసం సీతాఫలాలను కోసి ఎడ్లబండ్ల ద్వారా పట్టణ, నగర ప్రాంతాలకు తరలిస్తారు. వాటిని అమ్మి ఉపాధి పొందుతూ ఉంటారు. ఇది శీతాకాలంలోని గ్రామీణ కూలీలకు ఒక రకమైన ఉపాధి మార్గంగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుండి సీతాఫలాలను తెచ్చి పట్టణ, నగర ప్రాంతాల్లో అమ్మే రైతుల నుండి స్థానిక కూలీలు కొనుగోలు చేసి ప్రజలకు విక్రయించి ఉపాధి పొందుతూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుండి సీతాఫలాలను తెచ్చేవారి నుండి గంపగుత్తగా కొనుగోలు చేస్తారు. కొంత లాభాన్ని చూసుకొని ప్రజలకు సీజనల్ సీతాఫలాని అమ్ముతారు. అనేక రకాలైన పోషకాహార విలువలు గల సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే లభించే సీతాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువచేసే గుణం ఎక్కువ, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిని తినటం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తిని అరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది.

సీతాఫలాని మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్, జ్యూస్ తయారీలో అధికంగా వినియోగిస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా తినాల్సిన పండు ఏదైనా ఉందంటే అది ఒక్క సీతాఫలమేనని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను ఇచ్చే సీతాఫలం చూడగానే అందరికీ నోరూరుతుంది. అన్ని కాలాలలో సీతాఫలాలు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే సీతాఫలాలలో స్వీట్ ఎక్కువగా ఉండటంతో షుగర్ పేషంట్స్ మాత్రం తమకున్న మక్కువను తీర్చుకోలేకపోవడం బాధగా అనిపిస్తుంది.