లెఫ్ట్ పార్టీలు ఏ పార్టీతో అంటుకడతాయో

 

రాష్ట్ర విభజన నిర్ణయంతో స్వయంగా కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలలో సీపీఐ రాష్ట్ర విభజనను సమర్దిస్తుంటే, సీపీఎం వ్యతిరేఖిస్తోంది. గనుక వాటికి ఇంత వరకు రాష్ట్ర విభజన వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయినా, ఎన్నికలు దగ్గర పడుతున్నందున అవి ఇప్పుడు ఏ పార్టీతో అంటుకట్టాలో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమయింది.

 

ఎందుకంటే అవి రాష్ట్రంలో ఇంతవరకు స్వయంగా మనుగడ సాగించిన దాఖలాలు, పరిస్థితులు లేవు ఎన్నడూ లేవు గనుక, ఏదో ఒక పార్టీతో అంటు కట్టక తప్పదు. గతంలో ఆ రెండు తెదేపాతో కలిసిపనిచేసినప్పటికీ, ఇప్పుడు తెదేపా బీజేపీ వైపు అడుగులు వేస్తుండటంతో దానితో పొత్తులకి సంకోచిస్తున్నాయి.

 

ఇక సీపీఐ తెలంగాణాలో తెరాసతో పొత్తు పెట్టుకోవాలనుకొంటే, అది తన బద్ధ శత్రువయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపబోతోంది, గనుక తెరాసతో చేతులు కలుపలేదు. ఇక మిగిలింది మళ్ళీ తెదేపాయే. కానీ అది కూడా తను తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీతో పొత్తుపెట్టుకొంటే దానితోనూ కలవలేదు. అప్పుడు సీపీఐ ఎవరితో కలుస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

 

ఇక సీపీఎం పార్టీకి కూడా ఇంచుమించు ఇదే సమస్య ఎదురవుతుంది. ఇటీవల వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సీపీఎం నేతలను డిల్లీలో కలవడం, ఆ పార్టీతో పొత్తుకి ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తోంది. కానీ, జగన్ అటు మోడీని పొగుడుతూ, మరో వైపు యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని సంకేతాలు ఇస్తూ అనుసరిస్తున్న ద్వంద వైఖరి వలన వైకాపాతో ఆ పార్టీకి పొత్తులు సాధ్యం కాకపోవచ్చును. అంతే కాక వైకాపా మతతత్వ మజ్లిస్ పార్టీతో కూడా స్నేహానికి సిద్దమనే సంకేతాలు గతంలోనే పంపింది, గనుక ఆ పార్టీతో పొత్తులు అసలే కుదరక పోవచ్చును. పైగా కేవలం సీమాంద్రాకే పరిమితమయ్యే ఆ పార్టీతో పొత్తులవల్ల సీపీఎంకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.

 

తెదేపా రెండు ప్రాంతాలలో పోటీ చేస్తుంది గనుక, బీజేపీతో ఆపార్టీ పొత్తులు లేదా మద్దతుకి సిద్దపడినప్పటికీ, లెఫ్ట్ పార్టీలు అంతిమంగా మళ్ళీ తెదేపాకే చేరువ కావచ్చును. ఏమయినప్పటికీ, ఎన్నికలు దగ్గరపడితే గానీ, ఈ రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి రావు.