అమెరికాలో ఉద్యోగాలు పోయే స్థితిలో భారతీయులు!

హెచ్‌-1బీ వీసాతో  పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు క‌రోనా వైర‌స్ శాపంగా మారింది. దీంతో కరోనా దెబ్బకు అమెరికాలోవున్న భార‌తీయులు ఆందోళ‌న ప‌డుతున్నారు. ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. 
ఈ ప్రతికూల ప్రభావం హెచ్‌1బీ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిపై పడనుంది. ప్రస్తుత ఫెడరల్‌ నిబంధన ప్రకారం, ఒకవేళ వీరిలో ఎవరు ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో కేవలం 60 రోజులు మాత్రమే ఉండగలరు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సహా స్వదేశానికి తిరిగి రావాల్సిందే. అయితే ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని అక్కడి విదేశీ ఐటీ నిపుణులు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువును 60 నుంచి 180కి పెంచాలని కోరుతున్నారు. 

యూఎస్‌లో  దాదాపు 35 లక్షల మంది ఇప్పటివరకు జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక అంచనా ప్రకారం 67 మిలియన్ల అమెరికన్ల ఉద్యోగాలు హై రిస్క్‌లో ఉన్నాయని, దాదాపు 47 మిలియన్ల (4.7కోట్లు) మంది నిరుద్యోగులుగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.  

కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.  నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.