రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కొత్త ఆలోచన?

 

రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ కేంద్రం నెత్తిన వ్రేలాడిన ‘జనవరి 28’ కత్తిని ‘రోజంటే రోజూ కాదూ...నెలంటే నెలా కాదూ’ అంటూ పాడి అలవోకగా తీసి ప్రక్కన పడేసిన తరువాత, కాంగ్రెస్ పార్టీ గుండెల మీదనుంచి పెద్ద భారం దింపుకొన్నంత సంతోషపడింది. అప్పటి నుండి, ఇక ‘జనవరి 28’ వంటి మాటలు మాట్లాడకుండా, బుద్ధిగా, ప్రశాంతంగా రాష్ట్ర విభజనపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గవర్నర్ నరసింహన్, మాజీ ముఖ్య మంత్రి రోశయ్యలను డిల్లీ రప్పించుకొని, వారితో సలహా సంప్రదింపులు చేస్తోంది.

 

ఆ విధంగా చేయడంవల్ల ఒకవైపు తెలంగాణా సమస్యకి పరిష్కారం వెతకడమే కాకుండా, రాష్ట్రంలో తమ తెలంగాణా కాంగ్రెస్ నేతలకు భరోసా కూడా ఇవ్వగలుగుతోంది. ఇక తరువాత అంకంలో రాష్ట్రం లో మూడు ప్రాంతాల నాయకులతో చర్చల ప్రక్రియ మొదలుపెట్టి, ఎన్నికల వరకు లాగించగలిగితే, ఇక అప్పుడు తాడో పేడో తేలుస్తూ ఒక నిర్దిష్ట ప్రకటనతో ఎన్నికలలో అనుకూల ఫలితాలు రాబట్టుకోవచ్చును అని కాంగ్రెస్ ఆలోచన అయిఉండవచ్చును.

 

ఈ అంచనా ప్రకారం, మళ్ళీ చర్చల ప్రక్రియ బడ్జెట్ సమావేశాల తరువాత మొదలుపెడితే, వాటితో ములాయం సింగ్ ప్రకటించినట్లు మధ్యంతర ఎన్నికలు వచ్చే సెప్టెంబర్ నెలవరకు లాగించేయవచ్చును. ఇక ఒకసారి ఎన్నికల గంట మ్రోగిన తరువాత, ఏ రాజకీయ నాయకుడికయినా పార్టీ టికెట్ గురించి తప్ప తెలంగాణా గురించి ఆలోచించే ఓపిక ఉండవు. గనుక, అప్పుడు కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా కూడా తప్పనిసరిగా వారు ఆమోదించడమే గాక, ఆ నిర్ణయాన్ని ప్రజల చేత కూడా ఆమోదింపజేసుకొనే బాధ్యత కూడా సదరు పోటీదారుపైనే ఉంటుంది.

 

ఇక, జాతీయ మీడియా వండివార్చిన తాజా కధనాల ప్రకారం, కేంద్రం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కన్నా, రాష్ట్రంలో ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా మూడు ప్రాంతాలకు వేర్వేరు అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసి, వాటికి తగినన్ని అధికారాలు, నిధులు సమకూర్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కనీసం 10 నుండి 15 సం.ల కాల వ్యవధిని నిర్ణయించి, ఆలోగా మూడు ప్రాంతాలలో జరిగిన అభివృధి ఆధారంగా, రాష్ట్ర విబజన అవసరమా కాదా అని నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. అప్పటికీ తెలంగాణావాసుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక బలంగా ఉంటే అప్పుడే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

అయితే, ఈ విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు సమర్దించలేదు, అలాగని ఖండించలేదు. ఏమి చేసినా దానికి ఏదో ఒక వైపు నుంచి ఊహించని రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది గనుక, మీడియాని తనకు నచ్చినట్లు ఊహించుకొని వ్రాసుకొనే సౌకర్యాన్నికల్పించింది. డిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి, గవర్నర్ కాంగ్రెస్ అధిష్టానంతో తాము ఏమి మాట్లాడారో చేపుతారని ఊహించడం అడియాసే అవుతుంది.

 

ఇక ఏదయినా క్లూ దొరికితే అది బొత్స సత్యనారాయణ నుండే దొరకాలి. ఆయనని మీడియా నోరు జారేలా చేయగలిగితేనే కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఉన్న ఆలోచనలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే, అంతవరకూ ఎవరికి తోచిన ఊహాగానాలు, విశ్లేషణలు, భాష్యాలు చెప్పుకొంటూ కాలక్షేపం చేయడమే.