మన చదువులు అంతంతమాత్రమే!

Publish Date:Jan 11, 2017

 

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరు రోనాల్డ్‌ రాస్ ఏకంగా ఐదుగరు ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడో తరగతి చదివే విద్యార్థులు కనీసం తమ పేరుని తాము తెలుగులో రాయలేకపోవడమే కలెక్టరుగారి ఆగ్రహానికి కారణం అయ్యింది. దీనికి తోడు వీరికి చదువు చెప్పే టీచర్లు మాత్రం నిబ్బరంగా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని తెలిసి కలెక్టరుగారికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అయితే ఇదేదో సదరు కలెక్టరు ఆకస్మిక తనిఖీలో వెల్లడైన నిజం అనుకుంటే పొరపాటే! నిజంగా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఉన్న పాఠశాలలన్నింటి మీదా ఒకేసారి దాడి చేస్తే వేలమంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయవలసి వస్తుందేమో!

 

నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి వికాసం అద్భుతంగా సాగాలి. ఎలాంటి ఒత్తిడీ లేని చదువు, మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా పుస్తకాలు, ఆటపాటలకు కావల్సినంత ఆవకాశం, కోట్లకొద్దీ ప్రవహించే నిధులు... ఇవన్నీ చూసి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరుకోవాలి. కానీ పాచి పని చేసుకునైనా సరే ప్రైవేటు బడిలోనే చదివించాలని కోరుకుంటున్నారంటే అది ఖచ్చితంగా విద్యావ్యవస్థలోని వైఫల్యమే! ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన ఓ వ్యక్తి, తన పిల్లలకి ప్రైవేటు చదువులు చెప్పించేందుకే ఈ పని చేస్తున్నాని చెప్పడం చూస్తే... నిజంగా ప్రభుత్వాలు తలవంచుకోవాల్సిన పరిస్థితి.

 

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి కారణం ఉపాధ్యాయులే అంటూ అంతా విమర్శిస్తూ ఉంటారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్న నానుడి నుంచి బతికితే బడిపంతుల్లాగా బతకాలి అన్న స్థాయికి వారి జీతాలు చేరుకున్నాయి. కానీ పిల్లలను భావితరాలుగా తీర్చిదిద్దాలన్న తపన మాత్రం తగ్గిపోయిందన్న విశ్లేషణ వినిపిస్తోంది. కొందరికి సీనియారటీ మేరకు యాభైవేలకు మించి జీతం వస్తున్నా కూడా తమ జీతానికి తగ్గ ఫలితాన్ని అందించలేకపోతున్నారన్న విమర్శా ఉంది. ఏడాదిలో సగానికి పైగా రోజులని సెలవుల్లో గడిపేయడం, ట్యూషన్ల మీద శ్రద్ధ వహించడం వంటి కార్యకలాపాలతో పాటుగా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకునే ఉపాధ్యాయులు కూడా తెగ తారసిల్లుతారు. తమ దగ్గరకి వచ్చే పిల్లలంతా దిగువ మధ్యతరగతివారు కాబట్టి, వారికి చదువు చెప్పకపోయినా దేశానికి వచ్చే నష్టమేం లేదనే ‘అమూల్యమైన’ అభిప్రాయం కూడా కొందరిలో కనిపిస్తుంది.

 

ఉపాధ్యాయుల తీరు ఈ రకంగా ఉంటే విద్యాశాఖ తీరు మరో రకంగా సాగుతోంది. అసలు లోపం ఎక్కడ ఉంది? దానిని చక్కదిద్దడం ఎలా? అన్న విషయాల మీద విద్యాశాఖకు ఒక స్పష్టత ఉన్నట్లు తోచదు. అందుకనే ఒకోసారి ఒకో శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను అయోమయానికి గురిచేస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆంగ్లంతోనే ప్రభుత్వ పాఠశాలలు అద్భుతాలు సాధిస్తాయనే ఒకే ఒక్క వాదనని పట్టుకు వేళ్లాడుతుంటుంది. ఇక విద్యాశాఖ పెట్టే లక్ష్యాలకు భయపడి పదోతరగతిలో ఉపాధ్యాయులే స్వయంగా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

 

ఉపాధ్యాయులు, విద్యాశాఖ పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వాధినేతలు కూడా ఇందుకు మినహాయింపుగా కనిపించడం లేదు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి అనుకూలంగానే ప్రభుత్వ ప్రవర్తన ఉంటుందనేది బహిరంగ రహస్యం. అందులో వాస్తవాన్ని గ్రహించాలంటే ఒక్కసారి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన పాఠశాలల్లో వసతులని గమనిస్తే సరిపోతుంది. తెలుగు రాష్ట్రాలలో సగానాకి సగం ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ కనిపిస్తాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రత్యేకమైన రిజర్వేషన్‌ వంటి చట్టాలు కల్పించే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తోచదు. తమిళనాడులోలాగా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం వంటి చర్యలు తీసుకోవడమూ కనిపించదు. పైగా సాక్షాత్తూ ప్రభుత్వాధినేత నోటి వెంటే ఆంగ్ల విద్య గురించిన పొగడ్తల గురించి వినిపిస్తూ ఉంటాయి. వారి పక్కనే కార్పొరేట్‌ పాఠశాలల యజమానులు కనిపిస్తూ ఉంటారు. గొంగట్లో తింటూ వెంట్రుకలున్నాయని ఆరోపించినట్లుగా... పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నప్పుడు, ఎక్కడో ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగా చదువు చెప్పలేకపోతున్నారని ఆరోపించడం హాస్యాస్పదం కదా! మరి ఈ విషవిలయానికి అంతు ఎక్కడ!!!

By
en-us Analytical News -