ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే: అశ్వద్ధామరెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజుకు చేరుకుంది, జీతాలు లేక అవస్థలు పడుతున్న కార్మికులకు మద్దతుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. దీంతో జిల్లాలో పదో రోజు నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని టీ.ఆర్.ఎస్ నేత కేశవరావు కోరారు. పరిస్థితులు చేయిదాటకముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించారని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల విలీనం అంటే విధి విధానాలు మార్చుకోవాలని కోరడమేనని కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని కేశవరావు అన్నారు. కార్మికుల సమ్మె ఉధృతమైన సమయంలో కేకే చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం కావటం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమవడం, తాత్కాలిక సిబ్బంది కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సమయంలో సమ్మె పరిష్కారంపై కేకే ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి, పంతొమ్మిదిన బంద్ కు పిలుపునిచ్చాయి. అందుకే కేకే రంగంలోకి దిగి ప్రకటన చేశారా, ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.  మరోవైపు ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందనే వార్తలు గుప్పుమనడం కూడా కలకలం రేపాయి.

ఇప్పటికే ఓ టీఆర్ ఎస్ ఎంపీ ఆర్టీసీ కి చెందిన నాలుగెకరాల భూమిని టెండర్ దక్కించుకున్నారంటూ వార్తలు ప్రకంపనలు రేపాయి. మొత్తంగా అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తోనే కేకే ప్రకటన చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. పంతొమ్మిదిన బంద్ జరిగే లోపు ఏం జరగబోతోందనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. కేసీఆర్ ఆహ్వానిస్తే చర్చలకు రావటానికి సిద్ధమన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులు గవర్నర్ తమిళ సాయిని కలిశారు. ఆర్టీసీ, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తోపాటు పలువురు కార్మిక సంఘాల నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు మద్దతు ప్రకటించాయి, కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేశాయి. మంత్రులు పువ్వాడ, గంగుల ఎర్రబెల్లి కి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. మహిళా ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కారు. హన్మకొండ డిపో నుంచి ఏకశిల పార్కు వరకు నిరసన ర్యాలీ చేశారు.