చిరంజీవి విషయంలో క్లారిటీ ఇచ్చిన పల్లం.. నిజమేనా!

 

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాభవం చెందినప్పటినుండి, చిరంజీవి పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన పార్టీ మారే సూచనలు ఉన్నాయని కొందరు అభిప్రాయ పడ్డారు. ఇంకొందరయితే, తమ్ముడు పవన్ కళ్యాణ్ జన సేన పార్టీలో చేరుతాడని జోస్యం చెప్పారు. అయితే, ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తన పార్టీ లో చేరే అవకాశమే లేదని గట్టిగా చెప్పారు. ఒక వేళ చిరంజీవి కి నిజంగా జన సేన పార్టీలో చేరే ఉద్దేశ్యం ఉన్న కూడా తమ్ముడి స్టేట్మెంట్ తో నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి. మరి చిరు దారి ఎటు వైపు. కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతారా, లేదంటే వేరే పార్టీలోకి జంప్ అవుతారా?

 

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి చిరంజీవి గైర్హాజరవడం అనేక సందేహాలకు తావిచ్చినట్టయింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్, సీనియర్ నేత కుంతియా, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, సి.రామచంద్రయ్య, కిల్లి కృపారాణి, పల్లం రాజు తదితరులు హాజరుకాగా చిరంజీవి మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

 

కేంద్ర మాజీ‌మంత్రి పల్లం రాజు చిరంజీవి విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. "వ్యక్తిగత కారణాలవల్లే చిరంజీవి సమావేశానికి హాజరుకాలేదు. ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని, ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటారని," మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మరి చిరుకి నిజంగా పార్టీలో కొనసాగే ఉద్దేశ్యమే ఉంటే, ముఖ్యమైన పార్టీ కార్యకలాపాలకి కూడా ఎందుకు రావట్లేదు అనేది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న.

 

ఇప్పటికి స్తబ్దుగా ఉన్న చిరంజీవి, 2019 లో ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని, తన నిర్ణయం వచ్చే సంవత్సరం వెలిబుచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన సినిమాలు, టీవీ షోలతో బిజీ గా ఉన్నారు. ఖైదీ నం 150 పెద్ద హిట్ అవడంతో, ఈ ఒకటి రెండు సంవత్సరాలలో వీలయినన్ని మంచి సినిమాలు చేయడం ద్వారా తన అభిమానుల సంఖ్య మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, పొలిటికల్ మైలేజ్ పెంచుకోవంటే మాత్రం సినిమాలో, టీవీ షోలో సరిపోవు. జనాల్లోకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. దానికి ముందు, కాంగ్రెస్ లో ఉంటారా, లేక వేరే ఇతర పార్టీ వైపు వెళ్తారా అనే విషయంలో త్వరితమైన నిర్ణయం తీసుకోవాలి!

Related Segment News