మోదీ ఐడియాకి… చంద్రబాబు ఆమోదం!

 

మోదీ వచ్చాక ప్రతిపక్షాలకే కాదు… చాలా చోట్ల వున్న ప్రాంతీయ పార్టీలకు కూడా కునుకు లేకుండా పోతోంది. ఎన్డీఏలో వున్నా లేకున్నా , బీజేపికి వ్యతిరేకంగా మాట్లాడినా , మాట్లాడకున్నా, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైపున నిలిచినా , నిలవకున్నా… అందర్నీ టెన్షన్ పెడుతున్నారు మోదీ, షా! ఈ ఇద్దరు గుజరాతీ చాణుక్యులు ఉత్తర్ ప్రదేశ్ లోని ములాయం, మాయావతి మొదలు మహారాష్ట్రలోని ఉద్ధవ్ వరకూ అందర్నీ అల్లాడిస్తున్నారు. వీళ్ల బాధితులుగా మారిన వారిలో అరివింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా వున్నారు. అందుకే, చాలా చోట్లా బీజేపి మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు ఒకేలా విమర్శలకు దిగుతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీన్ వేరుగా వుంది!

 

చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు మోదీపై వ్యతిరేక కామెంట్ల పర్వం ఏపీ, తెలంగాణల్లో జరగటం లేదు. కేసీఆర్ ఎంత మాత్రం ప్రధానిని టార్గెట్ చేయటం లేదు. ఇక ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు అయితే వీలైనప్పుడల్లా నాలుగు మంచి మాటలే మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ ప్రవర్తన టీడీపీకి ఇబ్బందిగా మారినా సీఎం ఘాటుగా ఏనాడూ స్పందిచలేదు. పవన్ కళ్యాణ్, జగన్ ఇరువైపుల నుంచీ దాడి చేసినా చంద్రబాబు గంభీరంగానే నెట్టుకొచ్చారు. ఇక తాజాగా టీడీపీ అధినేత ఒకే దేశం ఒకే ఎన్నికల విషయంలో కూడా మోదీకి మద్దతు పలికారు! ముందస్తు ఎన్నికలు కాదు… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అన్న బాబు అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగేతే మంచిదేనన్నారు!

 

ప్రతీ మూడు నెలలకు ఒకసారి పార్లెమంట్, అసెంబ్లీ లేదా స్థానిక ఎన్నికలు వస్తే ఎప్పటికప్పుడు తమని తాము నిరూపించుకునేందుకే .. ప్రభుత్వాల సమయం సరిపోతోందని చంద్రబాబు అన్నారు. అందుకే, 2018 చివర్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా సరేనన్నారు. తాము చేస్తున్న అభివృద్ధే తమని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ మోదీ ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు స్పష్టంగా మద్దతు పలికిన సీఎం మన చంద్రబాబే. చాలా మంది ముఖ్యమంత్రులు ఈ ఆలోచనకు సుముఖంగానే వున్నా ఇంకా పబ్లిగ్గా మాట్లాడటం లేదు. కాని, ఏపీ సీఎం మోదీకి విస్పష్టంగా మద్దుతు తెలిపి మరో మంచి సంస్కరణకి ఉతం ఇచ్చారు. రానున్న రోజుల్లో బీజేపియేతర పార్టీ ఆధినేతలు చాలా మంది చంద్రబాబును ఫాలో అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అరవింద్, మమత బెనర్జీ లాంటి కరుడుగట్టిన మోదీ వ్యతిరేకుల్ని మినహాయిస్తే దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు మెల్ల మెల్లగా లైన్ల క్లియర్ అవుతున్నట్టే కనిపిస్తోంది!

 

అన్ని ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించటం వల్ల జాతీయ పార్టీల ప్రభావం విపరీతంగా పెరుగుతుందని వినిపిస్తోన్న వాదన కూడా ఏపీ సీఎం తోసి పుచ్చటం మనం తప్పకుండా గమనించాలి. ప్రజలు మంచి చేసిన పార్టీకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా మద్దతు పలుకుతారని ఆయన అన్నారు. 2014లో పార్లెమంట్ ఎలక్షన్స్ తో పాటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా తెలుగు రాష్ట్రాల్లో అధికారం టీడీపీ, టీఆర్ఎస్ ల స్వంతమే అయింది. బీజేపి గణనీయంగా లాభపడిందేం లేదు. కాబట్టి చంద్రబాబు తరహాలోనే అందరూ ముఖ్యమంత్రులు ఎన్నికల సంస్కరణకి ముందుకు రావాలని మనమూ కోరుకుందాం…