ఇదీ చంద్రబాబు ఎత్తుగడ అంటే..!

 

ప్రస్తుతం చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ పెద్ద కంపెనీల అధికారులతోనే సమావేశమై ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి బాగానే కష్టపడుతున్నారు. ఇక చంద్రబాబుకు ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే టెక్ దిగ్గజాల్లో ఒక కంపెనీ అయిన సిస్కో సీఈవో  జాన్ చాంబర్స్ హోటల్ కాకుండా.. తన ఇంట్లోనే ఆతిద్యం ఇచ్చారంటే తెలుగు వారిగా మనం గౌరవించ తగ్గ విషయమే. ఒక్క సిస్కోతోనే కాదు యాపిల్ ఇంకా పలు పెద్ద పెద్ద కంపెనీ ప్రతినిధులతోనే ఆయన సమావేశమై ఏపీకి పెట్టుబడులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సందేహాలు మొదలవుతున్నాయి అందరికి. ఎందుకంటే చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడు ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక ప్లాన్ వేయకుండా ఉండరు అనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబు ఇంత సడెన్ గా అమెరికా టూర్ వెళ్లడం అది కూడా తన కొడుకును ఐటీ మినిస్టర్ గా చేసిన తరువాత వెళ్లడం వల్ల అందరికి డౌట్ల మీద డౌట్ల వచ్చిపడుతున్నాయి. అంతేకాదు ఇదంతా జరగడానికి కొన్ని నెలల ముందే గ్రౌండ్ వర్క్ చేశారా అని తలలు పట్టుకొని ఆలోచించే నేతలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అంత పెద్ద దిగ్గజాలతో ఒక్కరోజులో అపాయిట్ మెంట్ అడిగితే అంత ఈజీగా దొరికే అవకాశమే ఉండదు. అపాయింట్ ఇవ్వడం అది కూడా వారి నివాసంలో ఇవ్వడం.. ఇవన్నీ చూస్తుంటే దీని వెనుక హార్డ్ వర్క్ బాగానే చేసినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం తన పుత్ర రత్న నారా లోకేశ్ గురించే అని స్పష్టంగా అర్ధమవుతోంది.

 

చాణక్యుడు ఏవిధంగా అయితే తన జ్ఞానముతో చంద్రగుప్తున్ని మౌర్య రాజ్యానికి చక్రవర్తిన చేశాడో అలాగే.. చంద్రబాబు కూడా తన తెలివితేటలతో నారా లోకేశ్ కు సింహాసనం అందిచాలని చూస్తున్నట్టు రాజకీయ వర్గాల చర్చ. ఈ నేపథ్యంలో చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఐటీ మినిస్టర్ గా నారా లోకేశ్ ను ఎంపిక చేయక ముందు ఆ పదవిలో పల్లె రఘునాథ్ రెడ్డిని నియమించారు చంద్రబాబు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా.. ఐటీ డెవలప్ మెంట్ జరగాలన్నా దానిపై గ్రిప్ ఉన్న క్యాండెట్ కావాలి. అంతేకాదు వేరే దేశానికి వెళ్లి మాట్లాడే నాలెడ్జ్ కానీ.. ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ.. కమ్యునికేషన్ కానీ పల్లె కు లేదు. మరి అతన్ని ఎందుకు నియమించారు అంటే. అది కూడా చంద్రబాబు వేసిన ఎత్తుగడల్లో ఒకటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఒక గీత పెద్దదిగా కనిపించాలి అంటే పక్కన చిన్న గీత గీయాలి అన్న నానుడి ప్రకారం... ఇక్కడ చిన్న గీత పల్లె అయ్యారని క్లియర్ గా అర్ధమవుతుంది. ఆయనను ఒక డమ్మీగా వాడుకొని.. ఇప్పుడు తన కొడుకును రంగంలోకి దింపి.. తాను కూడా రంగంలోకి దిగి ఏపీకి పెట్టుబడులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

 

వీటన్నింటితో పాటు ఇటీవల లోకేశ్ పై వస్తున్న విమర్శలను కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ టూర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పలు సందర్బాల్లో లోకేశ్ తడబాటుతో మాట్లాడటం.. జయంతిని వర్ధంతి అనడం... ఇంకా పలు సభల్లో ఆవేశంతో ప్రతిపక్ష పార్టీని తిట్టబోయి.. సొంత పార్టీనే విమర్శించడం.. ఇంకా హైలెట్ ఏంటంటే.. గూగుల్ లో ముద్దపప్పు అని కొడితే నారా లోకేశ్ అని చూపించడం వీటన్నిటి నుండి పుత్రరత్నాన్ని బయటపడేద్దామని.. తన కొడుకుని సమర్థవంతమైన నాయకుడిగా చేసే ప్రయత్న చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నారా లోకేశ్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తాను కూడా పలు ఐటీ కంపెనీ ప్రతినిధులతో చర్చలు చేపడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా లోకేశ్ ను ముఖ్యమంత్రిగా జగన్ కు పోటీగా దింపాలని..రెడ్ కార్పెట్ వేసి కొడుకుకు సీఎం పీఠం ఎక్కించాలని.. చంద్రబాబు రిటైర్ అయి పార్టీ బాధ్యతలు చూసుకోవాలని చూస్తున్నట్టు కూడా రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మొత్తానికి ఒక తండ్రి స్ఠానంలో ఉన్న చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ఎదుగుదలకు బాగానే కష్టపడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన కొడుకుపై ఉన్న నెగిటివ్ మార్క్ ను తొలగించి ఓ సమర్థ నాయకుడిగా చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ రాజకీయ ఎత్తుగడ అంటే. మరోసారి తాను రాజకీయ చాణుక్యుడని నిరూపించారు చంద్రబాబు.