బీజేపీకి దగరవుతున్న బాబు....దూరమవుతున్న జగన్ !

 

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నాయి. గత టర్మ్ లో కలిసి పని చేసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న టీడీపీ బీజేపీలు ఇంకా ఎన్నికలకి ఏడాదిన్నర ఉందనంగా విడిపోయారు. ఆనాటి నుండి తిట్టుకోని తిట్టు లేదు, అవమానించుకోని రోజు లేదు. ఈ క్రమంలో బీజేపీకి వైసీపీ దగ్గరకి జరిగినట్టు అనిపించింది. 

అసలు ఏమాత్రం అంచనాలు లేని వైసీపీ బ్రహ్మాండం బద్దలు కొట్టేలాగా విజయం సాధించడంతో ఇదేదో మోడీ ఈవీఎం మాయాజాలమే అని భావించారు అందరూ. కానీ అదేంటో కానీ ఆనాటి నుండి వైసీపీ బీజేపీకి దూరం జరుగుతూ వస్తోండగా టీడీపీ మాత్రం దగ్గరవ్వాలని చూస్తోంది. తాజాగా నిన్న రాజ్య సభలో పాస్ అయిన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఈ అధినేతలు తీసుకున్న స్టాండ్ లను బట్టి ఈ విషయం స్పష్టం అవుతోంది. 

చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు, అయితే అది బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అని కొందరు అంటే లేదు, బాబు ఆపరేషన్ సేఫ్ లో భాగంగా అని కొందరు అన్నారు. ఈ క్రమంలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఎవరి వైపూ స్టాండ్ తీసుకోకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు. 

ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విషయాన్ని విశ్లేషకులు హైలైట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో చాలా క్లోజ్ అని ఆరోపణలు వస్తున్న వైసీపీ మాత్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. 

అల వ్యతిరేకంగా వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో ప్రకటించారు. నిజానికి చెప్పాలంటే ఇది బిజెపికి అస్సలు మింగుడు పడని విషయమనే చెప్పాలి. టీడీపీ ,టీఆర్ఎస్ మాదిరిగా తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ వైసీపీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి ఆపోజిట్ స్టాండ్ తీసుకున్నట్టు చెప్పవచ్చు. 

నిజానికి అధికారం చేపట్టి రెండు నెలలు కూడా గడవక ముందే జగన్ బీజేపీకి ఎదురు తిరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు అప్పులు రాకుండా చేయడం, చంద్రబాబు మీద విచారణ చేయాలంటే ఎక్కడికక్కడ బ్రేకులు వేయడం దాకా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావన అని అంటున్నారు. 

నిజానికి ఏపీలో కూడా బీజేపీ నేతలు వైసీపీని చీల్చి చెండాడుతున్నారు. జగన్ కంటే చంద్రబాబు పాలనే బాగుందని బీజేపీ నేతలు అంటున్నారు అంటే ఏ మేరకు జగన్ ని టార్గెట్ చేశారు అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. రాష్ట్రంలో తామే ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీజేపీ చంద్రబాబుతో మళ్ళీ కలిసి జగన్ ని టార్గెట్ చేయచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు, బీజేపీ బాబుతో కలవావచ్చు, ఎందుకంటే ఇది రాజాకీయం కదా !